మాగంటి మరణంపై సమగ్ర విచారణ జరపాలి : బండి సంజయ్

మాగంటి మరణంపై సమగ్ర విచారణ జరపాలి : బండి సంజయ్
  • సీఎం రేవంత్​రెడ్డి నిజాలను నిగ్గుతేల్చాలి: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించి నిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్​ చేశారు. గోపీనాథ్​ మరణం మిస్టరీ అని స్వయంగా ఆయన తల్లే ఆరోపించిందన్నారు. గోపీనాథ్​ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని.. అందుకే కేసీఆర్​ కుటుంబంపై ఉన్న కేసులపై విచారణలు, అరెస్టులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు. ఎక్కడైనా ఆస్తుల పంపకాలపై కుటుంబ సభ్యులు కొట్లాడుకోవడం చూశామని.. ఇక్కడ మాత్రం గోపీనాథ్ ఆస్తులపై వీరిద్దరు కొట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. 

శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. గోపీనాథ్ చనిపోయింది ఎప్పుడు? ఎవరి కోసం ఆపారు? ఆయన కుటుంబ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం స్టేట్ మెంట్లను రికార్డు చేయాలన్నారు. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్టు గోపీనాథ్ కొడుకే ఆరోపించారని.. అయినా, సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం స్పందించడం లేదన్నారు. గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులకు, బీఆర్ఎస్ క్యాడర్ కు అనేక అనుమానాలున్నాయన్నారు. 

జూబ్లీహిల్స్ ప్రజలు.. అభివృద్ధి కావాలా? అరాచక పాలన కావాలా? తేల్చుకోవాలన్నారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరిస్థితులు మారిపోయాయని, బీజేపీ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతినెలా రూ.500 కోట్ల చొప్పున ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా? అని బండి సంజయ్​ నిలదీశారు. టోకెన్లు ఇచ్చి మరీ మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్​చేశారు.