వీధి కుక్కల నియంత్రణకు.. బర్త్ కంట్రోల్ సెంటర్లు

వీధి కుక్కల నియంత్రణకు..  బర్త్ కంట్రోల్ సెంటర్లు
  • ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు
  • వార్డులవారీగా కుక్కల పట్టివేత
  • ఒక్కో కుక్కకు రూ.1450 చెల్లింపు
  • వీధి కుక్కల సంతానానికి క్రమంగా బ్రేక్

నిర్మల్, వెలుగు :  వీధి కుక్కల జనన నియంత్రణ కోసం ప్రభుత్వం బర్త్​ కంట్రోల్​ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ ఆపరేషన్లతో ప్రజలకు కుక్కల బెడద తప్పనుంది. ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు వీధుల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే వీధి కుక్కల సంతానాన్ని నిరోధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఏబీసీ (అనిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో ఏబీసీ సెంటర్ల కోసం స్థల సేకరణ పూర్తి చేశారు. 

నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీకి... 

ఏబీసీసెంటర్ల నిర్వహణ బాధ్యతను మున్సిపాలిటీల వారీగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పనున్నారు. దీనికి సంబంధించి అన్ని మున్సిపాలిటీలు టెండర్ నోటిఫికేషన్లను జారీ చేశాయి. ఒక్కో వీధి కుక్కకు రూ.1450 మున్సిపాలిటీలు చెల్లించనున్నాయి. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలు వీధి కుక్కలను మున్సిపాలిటీల పరిధిలోని వార్డులవారీగా పట్టుకొని ఏబీసీ సెంటర్ కు తరలించాల్సి ఉంటుంది. సెంటర్ లో పశువైద్యాధికారి వీధి కుక్కలకు బర్త్​ కంట్రోల్​ ఆపరేషన్లు చేసి వారం రోజులపాటు వాటిని ఇక్కడే సంరక్షిస్తారు. అవసరమైన మేరకు వాటికి ఆహారం కూడా అందిస్తారు. వారం రోజుల తర్వాత ఆ కుక్కలను తాము తీసుకొచ్చిన వార్డులోనే వదిలి పెడుతారు.

మున్సిపాలిటీల పర్యవేక్షణ...  

ఏబీసీ సెంటర్లను ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించనుండగా, మున్సిపాలిటీలు పర్యవేక్షించనున్నాయి. ఏజెన్సీలు వీధి కుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడమే కాకుండా వాటికి ఫీడింగ్, మెడిసిన్స్, రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం,  డీవార్మింగ్ వంటి పనులను మున్సిపాలిటీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ అధికారికి బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఏజెన్సీ తాము పట్టుకున్న చోటనే వీధి కుక్కలను వదిలివేయాలన్న నిబంధనపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా ఏదైనా వీధిలో వీధి కుక్క మరణిస్తే వెంటనే వాటి కళేబరణాన్ని తరలించే బాధ్యతను కూడా ప్రైవేట్ ఏజెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. 

ఏబీసీ సెంటర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం..  

నిర్మల్ పట్టణానికి సమీపంలో ఉన్న నాగనాయిపేట డంపింగ్ యార్డ్ వద్ద ఏబీసీ  సెంటర్ ను నిర్మించనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి రూ.15 లక్షల నిధులు మంజూరయ్యాయి. మరో రూ.25 లక్షలు అదనంగా అవసరం కానున్నాయి. ఈ పనులను పంచాయతీ రాజ్ శాఖకు అప్పజెప్తాం. ఏబీసీ సెంటర్ లో వీధి కుక్కలకు ఆపరేషన్లు చేస్తాం. దీని కారణంగా కుక్కల సంతానం క్రమంగా తగ్గనుంది. తద్వారా ప్రజలకు వీధి కుక్కలతో ఇబ్బందులు తప్పుతాయి.- జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్  కమిషనర్, నిర్మల్