డ్రోన్ నిఘా ఉత్తదేనా?.. నడిగడ్డలో ప్రారంభించి వదిలేసిన పోలీస్ శాఖ

డ్రోన్ నిఘా ఉత్తదేనా?.. నడిగడ్డలో ప్రారంభించి వదిలేసిన పోలీస్ శాఖ
  • గద్వాల పట్టణంతో పాటు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలు

గద్వాల, వెలుగు:చోరీలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్​ నిఘా పక్కన పడేశారు. గద్వాల జిల్లాలో డ్రోన్ తో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు ప్రకటించిన ఎస్పీ శ్రీనివాసరావు, గత ఏడాది నవంబర్  28న ఎస్పీ ఆఫీసులో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి డ్రోన్  వ్యవస్థ గద్వాల పట్టణంతో పాటు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. అట్టహాసంగా ప్రారంభించిన అధికారులు, ఆ తర్వాత దానిని మూలకు పడేశారు. 

దొంగతనాలు, ట్రాఫిక్  నియంత్రణ, బహిరంగ సభలు, జాతరలో నిఘా కోసం డ్రోన్  వ్యవస్థ ఉపయోగపడుతుందని భావించినప్పటికీ, దానిని వినియోగించకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వరుస చోరీలు జరుగుతున్నాయి. వారం రోజుల కింద ఇంట్లో ఉన్న మహిళను చంపేసి బంగారం, వెండి నగలను ఎత్తుకెళ్లారు.  ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించిన డ్రోన్  వ్యవస్థను వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దొంగతనాలతో బెంబేలు..

దొంగతనాలతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 21న గద్వాల పట్టణంలోని శేరెల్లి వీధిలో అహ్మద్  ఇంటిలో చోరీ జరిగింది. అదే కాలనీలో లక్ష్మి అనే మహిళను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లారు. 3 రోజుల కింద గద్వాల్  పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీలో టీచర్  వెంకట్రాములు ఇంటిలోకి దొంగలు చొరబడి చోరీకి యత్నించారు. ఇలా వరుసగా దొంగతనాలు చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఓపెన్  చేసి వదిలేసిన్రు..

గద్వాల జిల్లా పోలీసులు ముందు చూపుతో గత ఏడాది నవంబర్  28న డ్రోన్ తో నిఘాను ప్రారంభించారు. కానీ, దానిని కంటిన్యూ చేయకుండా వెంటనే నిలిపేశారు. డ్రోన్  వ్యవస్థతో నిఘా పెట్టేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకుంటే ప్రారంభించడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డ్రోన్​ నిర్వహణపై అంచనా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. 

చోరీల నియంత్రణపై ఫోకస్​ ఏదీ?

జిల్లాలో జరుగుతున్న చోరీల నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నారనే విమర్శలున్నాయి. నిఘా కోసం అత్యధిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన డ్రోన్  వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైట్  బీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన చోరీ కేసులపై స్పెషల్  ఫోకస్  పెట్టి, ఆ కేసులను త్వరగా ఛేదిస్తే ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.

ఖర్చుతో కూడుకోవడంతోనే..

డ్రోన్  నిఘా ఖర్చుతో కూడుకుంది. డ్రోన్ తో నిఘా పెట్టే విషయంపై దృష్టి పెడతాం. ఇటీవల జరిగిన చోరీలపై ఇప్పటికే స్పెషల్  ఫోకస్  పెట్టాం. పట్టణంలో దొంగతనాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.- మొగులయ్య, డీఎస్పీ, గద్వాల