
హైదరాబాద్, వెలుగు: పిల్లలకు మనమేమిచ్చినా, ఇవ్వకపోయినా.. మంచి వాతావరణం, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రకృతి కావాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతి పుట్టిన రోజున ఓ మొక్కను నాటి సమాజానికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలని, మంచి పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. గురువారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 12వ గ్రాండ్ నర్సరీ మేళా పేరుతో నిర్వహించిన ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షోను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గత ఏడేండ్లలో 240 కోట్ల మొక్కలు నాటామని, ఈ ఏడాది మరో 20 కోట్ల మొక్కలను నాటబోతున్నామని చెప్పారు.
రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనం.. హరితహారంతో 7.6 శాతం గ్రీన్ కవర్ పెరిగి 31.6 శాతానికి చేరిందని ఇటీవల కేంద్ర అటవీ శాఖ లెక్కలు తేల్చాయన్నారు. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరిట నర్సరీలు ఏర్పాటు చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ నెల 21న వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ పెట్టి ప్రత్యేకంగా ప్రకృతి వనాల పెంపకానికి తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని నర్సరీల్లో పెరిగిన మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. నగరాలు కాంక్రీట్ జంగిల్‌లా పెరుగుతున్నందున చిన్న గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే రిలీఫ్ ఉంటుందన్నారు.
ఈ నెల 22 వరకు నర్సరీ మేళా..
గ్రాండ్ నర్సరీ మేళా ఈ నెల 22 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని మేళా ఇన్‌చార్జి ఖాలీద్ అహ్మద్ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి 140కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అన్నీ ఒకే చోట దొరుకుతాయని తెలిపారు. హోం గార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి వేదిక అని పేర్కొన్నారు.