V6 News

క్లైమేట్ చేంజ్ ఓ ప్రజావిపత్తు: పర్యావరణ నిపుణులు

క్లైమేట్ చేంజ్ ఓ ప్రజావిపత్తు: పర్యావరణ నిపుణులు
  • 1.2 లక్షల ఏండ్లలో కనీవినీ ఎరుగని వేడి
  • యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్, వ్యూస్ ఎన్జీఓ ఆధ్వర్యంలో సదస్సు


హైదరాబాద్, వెలుగు: క్లైమేట్ చేంజ్ ఒక ప్రజా విపత్తు అని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.‌‌‌‌ ఇంతటి పర్యావరణ మార్పులు గత 1.2 లక్షల ఏండ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. గ్లోబల్ వార్మింగ్  స్టేజి నుంచి గ్లోబల్  బాయిలింగ్  స్టేజ్  వరకు వచ్చామని పేర్కొన్నారు. ఒడిశా రాజధాని‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌లో యూఎస్  కాన్సులేట్  జనరల్ హైదరాబాద్, వ్యూస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల జర్నలిస్టుల వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ను శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ, ఏపీ, ఒడిశాకు చెందిన జర్నలిస్టులు, పర్యావరణ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పర్యావరణ మార్పుల ప్రభావాల రిపోర్టింగ్‌‌‌‌పై పలువురు మాట్లాడారు. క్లైమేట్ చేంజ్ రిపోర్టింగ్‌‌‌‌లో జర్నలిస్టులకు అవసరమైన టెక్నికల్ టూల్స్‌‌‌‌ను అందించేందుకు ఈ వర్క్‌‌‌‌షాప్ ఉపయోగపడుతుందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ చెప్పారు. కచ్చితమైన ఫిగర్స్‌‌‌‌తో జర్నలిస్టులు క్లైమేట్ చేంజ్‌‌‌‌పై విశ్లేషణాత్మక కథనాలను అందించాలన్నారు.‌‌‌‌ స్థానికంగా జరిగే పర్యావరణ మార్పులతో గ్లోబల్ లెవెల్‌‌‌‌లో పడే ప్రభావంపై రిపోర్ట్ చేయాలన్నారు. మోరంచపల్లి వరదలపై పర్యావరణ నిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ వర్ష విపత్తు అని డౌన్ టు ఎర్త్ మేనేజింగ్  ఎడిటర్  రిచర్డ్  మహాపాత్ర అభిప్రాయపడ్డారు. ఒక్క రాత్రిలో అంత వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ ఈ వరద విపత్తును తన తదుపరి నివేదికలో‌‌‌‌ పొందుపరిచే అవకాశాలున్నాయని తెలిపారు. క్లైమేట్ చేంజ్‌‌‌‌తో వలసలు పెరుగుతున్నాయని ఎయిడ్  ఎట్  యాక్షన్  సంస్థ డైరెక్టర్ ఉమీ డేనియల్ అన్నారు. మీడియా సంస్థలు పర్యావరణ మార్పులపై మరింత ఎక్కువగా కథనాలను రిపోర్ట్ చేసేందుకు యూఎస్  కాన్సులేట్‌‌‌‌తో కలిసి ఈ వర్క్‌‌‌‌షాప్  నిర్వహిస్తున్నామని వ్యూస్  ఇండియా ఎగ్జిక్యూటివ్   డైరెక్టర్  సెల్విన్ భీమ రావు చెప్పారు.