ఎవరికీ తెలియని EPFO బెనిఫిట్ ఇదే: 7 లక్షల వరకు ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్.. ఎలా అంటే ?

ఎవరికీ తెలియని EPFO బెనిఫిట్ ఇదే: 7 లక్షల వరకు ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్.. ఎలా అంటే ?

ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా వచ్చే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కుటుంబాలకు పెద్ద అండగా నిలుస్తోంది. ఈ పథకాన్ని 1976లో మొదలుపెట్టారు. ఈపీఎఫ్‌లో మెంబరుగా ఉన్న ఉద్యోగి ఉద్యోగం చేస్తూ చనిపోతే అతని నామినీ లేదా కుటుంబానికి రూ.7 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ సదుపాయం ప్రైవేట్ ఉద్యోగులకు జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) లాగా పనిచేస్తూ, అవసరమైనప్పుడు కుటుంబాలకు ఎంతో మద్దతు ఇస్తుంది.

EDLI పథకం అంటే ఏమిటి?
EDLI పథకం కింద చనిపోయిన ఉద్యోగి ఈపీఎఫ్ సభ్యుడిగా ఉంటే అతని నామినీ లేదా చట్టపరమైన వారసులకు బీమా(insurance) డబ్బులు అందుతాయి. ఈ డబ్బులు ఉద్యోగి జీతం ఆధారంగా లెక్కిస్తారు. 2021లో ఈపీఎఫ్ఓ తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం... గరిష్టంగా 7 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. అలాగే కనీస హామీ మొత్తం 2.5 లక్షలు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బీమా కోసం ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యోగికి వచ్చే బేసిక్ జీతంలో 0.5% కంపెనీ EDLIకి చెల్లిస్తుంది. అంటే, ఒక ఉద్యోగికి నెలకు రూ.75 మాత్రమే కడుతున్నట్లు. ఉదాహరణకు 15  వేల జీతం అంటే అందులో 0.5% అంటే రూ.75 అని... 

EDLI పథకం లాభాలు: 
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కింద రిజిస్టర్ అయిన ప్రతి ఉద్యోగికి ఆటోమేటిక్‌గా EDLI పథకం వర్తిస్తుంది. దీనికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ గానీ, ప్రీమియంగానీ కట్టక్కర్లేదు. నామినీ లేదా చట్టపరమైన వారసుడు గరిష్టంగా రూ.7 లక్షల వరకు పొందుతారు. ఇది సగటు నెల జీతానికి 35 రెట్లు అలాగే రూ.1.75 లక్షల బోనస్‌గా లెక్కిస్తారు.

ఉద్యోగి జీతం తక్కువగా ఉన్నా కూడా, నామినీకి కనీసం రూ.2.5 లక్షల బీమా(insurance) ప్రయోజనం ఖచ్చితంగా అందుతుంది. ఇది 15 ఫిబ్రవరి 2020 నుండి అమలులో ఉంది. అయితే ఈపీఎఫ్ఓ అన్ని క్లెయిమ్‌లను 20 రోజుల్లోపు చేయాలి.  ఉద్యోగులు ఈ ప్రయోజనం కోసం ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు. వారి తరపున కంపెనీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈపీఎఫ్ చట్టం, 1952 కింద 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలన్నీ  సిబ్బందిని తప్పకుండా EDLI పథకంలో చేర్చాలి. 

ఈపీఎఫ్ చట్టంలోని సెక్షన్ 17(2A) ప్రకారం, కంపెనీలు EDLI వద్దనుకోవచ్చు. కానీ, అలా చేయాలంటే కంపెనీలు EDLI కంటే సమానమైన లేదా ఎక్కువ లాభాలను ఇచ్చే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఉద్యోగులకు కచ్చితంగా ఇవ్వాలి. ఈపీఎఫ్ఓ  EDLI పథకం కేవలం బీమా(insurance) పథకం మాత్రమే కాదు, కష్టకాలంలో ఉద్యోగుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఆసరా. ఉద్యోగులు అదనంగా ఎం కట్టకుండానే, ప్రైవేట్ రంగ ఉద్యోగి కుటుంబానికి ఇబ్బంది సమయంలో అవసరమైన ఆర్థిక భద్రత దక్కేలా ఈ పథకం చేస్తుంది.