
- రూ.70 లక్షల కోట్లకు చేరిన ఏయూఎం
న్యూఢిల్లీ: యూఎస్ టారిఫ్‌లపై ఆందోళనలు, ఇన్వెస్టర్ల ప్రాధాన్యం హైబ్రిడ్ ఫండ్స్ వైపు మళ్లడంతో గత నెల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్‌ఫ్లో 3.24 శాతం తగ్గి రూ.24,269 కోట్లకు చేరుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగి మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో నెలలోనూ ఈక్విటీ ఫండ్లలో ఇన్‌ఫ్లో తగ్గింది. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు బాగానే ఉన్నాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ. 26,632 కోట్ల ఇన్‌ఫ్లో ఉంది. ఇది గత నెలలో రూ. 25,926 కోట్ల కంటే ఎక్కువని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) శుక్రవారం విడుదల చేసిన డేటా చూపించింది.
సిప్ ఖాతాల సంఖ్య 8.38 కోట్లకు చేరిందని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. ఈక్విటీ ఎంఎఫ్‌లలో మార్చిలో రూ. 2.02 లక్షల కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అయితే డెట్ ఫండ్‌లు రూ. 2.19 లక్షల కోట్ల ఇన్‌ఫ్లోను సాధించాయి. మొత్తంమీద, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏప్రిల్‌లో రూ. 2.77 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది.
మార్చి ముగింపు నాటికి రూ. 1.64 లక్షల కోట్ల అవుట్‌ఫ్లో ఉంది. పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ మార్చి చివరి నాటికి రూ.65.74 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయిలో రూ.70 లక్షల కోట్లకు పెరిగింది. ఈక్విటీ- ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్‌లో రూ.24,269 కోట్ల ఇన్‌ఫ్లోను నమోదు చేశాయి.
మార్చిలో వచ్చిన రూ.25,082 కోట్ల కంటే ఇవి తక్కువ. ఫిబ్రవరిలో రూ.29,303 కోట్లు, జనవరిలో రూ.39,688 కోట్లు, డిసెంబర్‌లో రూ.41,156 కోట్లు ఇన్‌ఫ్లో ఉంది. టారిఫ్‌ల యుద్ధం, హైబ్రిడ్ వ్యూహాల వైపు పెట్టుబడిదారుల చూడటంతో ఇన్‌ఫ్లో తగిందని ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పుంజ్ అన్నారు. మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్- మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పెట్టుబడులు విపరీతంగా తగ్గాయని అన్నారు.