ఎంపీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోం... ఎర్రబెల్లి దయాకర్​ రావు

ఎంపీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోం... ఎర్రబెల్లి దయాకర్​ రావు
  • వాటితోని వచ్చేది లేదు..పోయేది లేదు..
  • రేవంత్​ రెడ్డితో కలిసి జనగామ జిల్లా ఎత్తేసేందుకు కడియం కుట్ర

జనగామ, వెలుగు : ‘ఎంపీ ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోవద్దు. వాటితో వచ్చేది లేదు. పోయేది లేదు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్​లోని బీఆర్ఎస్ ​జిల్లా పార్టీ ఆఫీస్​లో తెలంగాణ అవతరణ వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్​రెడ్డి ప్రభుత్వం మరో యేడాదిలో పడిపోయే చాన్స్​ ఉందన్నారు.

తెలంగాణలో ప్రజలు కేసీఆర్​పాలననే కోరుకుంటున్నారన్నారు. మహబూబ్​నగర్​లో ఎమ్మెల్సీ గెలిచామని, వరంగల్​–నల్గొండ– ఖమ్మం గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ కూడా గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డితో కలిసి స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లాను ఎత్తేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. జిల్లాను కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు.

స్టేషన్ ఘన్​పూర్​లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ లీడర్​ఒత్తిడితో ఎన్నికల ఉల్లంఘన కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు కాంగ్రెస్​కు అనుకూలంగా వ్యవహరించి తన జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కడియం నమ్మక ద్రోహి అన్నారు. జడ్పీ చైర్​పర్సన్​ గిరబోయిన భాగ్యలక్ష్మి, మున్సిపల్​ చైర్​పర్సన్​ పోకల జమున, ఎడవెల్లి కృష్ణారెడ్డి, గద్దల నర్సింగరావు, ఇర్రి రమణారెడ్డి, గాంధీ నాయక్​, వారాల రమేశ్, చెంచారపు పల్లవి, చిట్ల జయశ్రీ పాల్గొన్నారు.