తెలంగాణకు ప్రధాని ఏం చేసిండు ? ఎందుకు రిసీవ్ చేసుకోవాలె ?

తెలంగాణకు ప్రధాని ఏం చేసిండు ? ఎందుకు రిసీవ్ చేసుకోవాలె ?
  • ఎందుకు రిసీవ్ చేసుకోవాలె, ఎందుకు సన్మానం చేయాలె కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదు    
  • రేవంత్‌‌కు కాకతీయ సామ్రాజ్యంపై అవగాహన లేదు    
  • కులాలను చూసి కాదు.. అభివృద్ధిని చూసి జనం ఓట్లేస్తరు

హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని నిలదీశారు. “తెలంగాణకు ఏం చేసిండని ప్రధాని వస్తుండు. మేం ఎందుకు రిసీవ్ చేసుకోవాలె? ఎందుకు సన్మానం చేయాలె? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేసిండా?’’ అని ఫైర్ అయ్యారు. సోమవారం రంగారెడ్డి జడ్పీ హాల్‌‌లో ఈజీఎస్ (ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్) స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌‌ జరిగింది. మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడారు. సర్కారు కంపెనీలను అమ్ముతూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు సిగ్గుండాలన్నారు. ప్రధాని వస్తుండనే కేసీఆర్ ఇతర రాష్ర్టాల పర్యటనకు వెళుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదన్నారు. కాకతీయ సామ్రాజ్యంపై అవగాహన లేకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. కులాలను బట్టి ప్రజలు ఓట్లు వేయరని, అభివృద్ధిని చూసి ఓట్లేస్తారని చెప్పారు. తన సొంత ఇమేజ్‌‌ను పెంచుకునేందుకు రేవంత్ ఆరాటపడుతున్నారని విమర్శించారు.

కేంద్రం నిధులే ఆగినయి :-
తెలంగాణపై కేంద్రం క‌‌క్ష సాధింపు చ‌‌ర్యల‌‌ను మానుకోవాలని ఎర్రబెల్లి అన్నారు. ఉపాధి హామీ నిధుల్లో కోత విధించ‌‌కుండా, క‌‌నీసం 16 కోట్ల ప‌‌నిదినాల‌‌ను ఆమోదించాలని కోరారు. వ్యవసాయానికి ఈ స్కీమ్‌‌ను అనుసంధానం చేయాలని, మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పనులకు అనుమతించాలని సమావేశంలో తీర్మానాలు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.97 కోట్ల ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ బిల్లులు కూడా రాష్ట్రానికి సంబంధం లేకుండా డైరెక్ట్‌‌గా కూలీల అకౌంట్లలోకి పంపించడం అన్యాయమన్నారు. బ‌‌కాయిలు చెల్లించ‌‌కుండా రాష్ట్రాన్ని బ‌‌ద్నాం చేస్తున్నారని, అవ‌‌గాహ‌‌న లేకుండా బండి సంజ‌‌య్ వంటి నేత‌‌లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ ప‌‌నులు జోరుగా న‌‌డుస్తుండ‌‌టం, వ‌‌డ్ల కొనుగోళ్లలో అధికారులు బిజీగా ఉండ‌‌టం, ఎండ‌‌లు ఎక్కువ‌‌గా ఉండ‌‌టం వంటి కార‌‌ణాల వల్ల 5వ విడ‌‌త ప‌‌ల్లె ప్రగ‌‌తి కార్యక్రమాన్ని వాయిదా వేశామని ఎర్రబెల్లి చెప్పారు. అధికారుల కోరిక మేర‌‌కే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేరే కార‌‌ణాలేవీ లేవ‌‌ని తెలిపారు.

స‌‌ర్పంచ్‌‌లు ఓపిక ప‌‌ట్టాలి :-
కొన్ని చోట్ల స‌‌ర్పంచ్‌‌లు త‌‌మ‌‌కు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేద‌‌ని అంటున్నారని,  రోడ్ల మీద‌‌కు వ‌‌స్తూ మీడియాకెక్కుతున్నారని మంత్రి దయాకర్ రావు విమర్శించారు. సర్పంచ్‌‌లకు పెండింగ్​లో ఉన్న బిల్లులన్నీ కేంద్రం నుంచి రావాల్సినవేనని చెప్పారు. స‌‌ర్పంచ్‌‌లు సంయ‌‌మ‌‌నం పాటించాల‌‌ని, ఆందోళ‌‌న చెందవ‌‌ద్దని సూచించారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు త్వరలో బిల్డింగ్‌‌లు కట్టిస్తామని, దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్‌‌రావుతో చర్చిస్తామని తెలిపారు.