ప్రజలను రెచ్చగొట్టమని సంజయ్కు మోడీ చెప్పిండు

ప్రజలను రెచ్చగొట్టమని సంజయ్కు మోడీ చెప్పిండు

కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడిని ఆయన ఖండించారు. బీజేపీ నాయకులు కవిత ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మను ఎవరు పట్టించుకోని సమయంలో కవిత ఒక గుర్తింపు తెచ్చారని చెప్పారు. కేసీఆర్ ది మచ్చలేని కుటుంబమని..ప్రాణాలకు తెగించి మరీ తెలంగాణను సాధించినట్లు వ్యాఖ్యానించారు. 

కార్యకర్తలు లేకనే బౌన్సర్లను పెట్టుకొని బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని.. ప్రజలు స్వచ్చందంగా వచ్చి ఆయన యాత్రను అడ్డుకున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టుమని బండి సంజయ్ కు మోడీ చెప్పారని ఆరోపించారు. దేవురుప్పులలో దాడి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. భయపెడితే.. భయపడడానికి ఇక్కడ ఎవరూ సిద్దగా లేరని, ఇలాంటివి కేసీఆర్ చాలా చూసారని అన్నారు. మోటర్లకు మీటర్లు పెడుతామన్న కేంద్రం.. రైతులకు ఏం న్యాయం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో మునుగోడు ప్రజలు బీజేపీకి తగిన బుద్ధిచెప్తారని ఎర్రబెల్లి విమర్శించారు. 

 ఇలాంటి నీచమైన పార్టీని చూడలేదు

ఒక మహిళ అని చూడకుండా కవిత ఇంటిపై బీజేపీ చేసిన దాడి ఖండిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. తాను  30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. అనేక పార్టీలను చూశాను కానీ ఇలాంటి నీచమైన పార్టీని చూడలేదని విమర్శించారు. గత కొన్ని రోజుల నుండి తొండి సంజయ్ మత విద్వేషాలను రగిలిస్తూ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై దొంగ ప్రకటనలు చేస్తూ.. ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెడితే రాబోయే రోజుల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు. 

విద్వేషాలు రెచ్చగొట్టే యాత్ర

బండి సంజయ్ ది ప్రజా సంకల్ప యాత్ర కాదని.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యాత్రని ఎమ్మెల్యే  అరూరి రమేష్ మండిపడ్డారు. అనేక ఉద్యమాలు చేసిన కవిత ఇంటిపై బీజేపీ దాడి చేయడం దుర్మార్గమన్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ నాయకులు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.