పేదల సంక్షేమానికి బీఆర్‌‌ఎస్‌‌ కృషి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

పేదల సంక్షేమానికి  బీఆర్‌‌ఎస్‌‌ కృషి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

తొర్రూరు, వెలుగు : సబ్బండ వర్గాల సంక్షేమానికి బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీ రాజ్‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు చెప్పారు. మహబూబాబాద్‌‌ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో రూ.2 కోట్లతో నిర్మించనున్న బేడ బుడగ జంగాల ఫంక్షన్‌‌ హాల్‌‌, దోబీఘాట్‌‌ నిర్మాణానికి శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. 

అనంతరం తొర్రూరు శివారులోని ఫంక్షన్‌‌హాల్‌‌లో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. బేడ బుడగ జంగాల సామాజిక వర్గానికి సంక్షేమ పథకాల్లో ప్రయారిటీ ఇస్తున్నామని, దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలోనూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. 

Also Read :- పాలపై ఇన్సెంటివ్ ఇంకెప్పుడిస్తరు : పాడిరైతులు

తొర్రూరు మండలంలో ఎంపీపీ, మూడు కౌన్సిలర్‌‌ పదవులు బేడ బుడగ జంగాలకు కేటాయించినట్లు చెప్పారు. దళితబంధు పథకం కోసం ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు ఖర్చు చేసి, 35 వేల యూనిట్లను గ్రౌండింగ్‌‌ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌‌లో రూ.17,700 కోట్లు కేటాయించామని, రాష్ట్రంలోని సుమారు 19 లక్షల ఫ్యామిలీలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. 

 

అప్పుడే పుట్టిన శిశువు నుంచి, వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకం అందుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు. అనంతరం బలగం సినిమా ఫేం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి దయాకర్‌‌రావు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. 

అంతకుముందు బేడ బుడగ జంగాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ శశాంక, రోడ్డు డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ మెట్టు శ్రీనివాస్, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్‌‌ చైర్మన్‌‌ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్‌‌ చైర్మన్‌‌ కాకిరాల హరిప్రసాద్, రైతుబంధు కమిటీ జిల్లా సభ్యుడు కిశోర్‌‌రెడ్డి, టీఆర్‌‌ఎస్‌‌ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు బిందు శీను, అమ్మాపురం సర్పంచ్‌‌ కడెం యాకయ్య, మున్సిపల్‌‌ కౌన్సిలర్లు తూర్పాటి సంగీత రవి,పేర్ల యమునా జంపన్న, నర్కూటి గజానంద్, బుడగ జంగాల నాయకులు తూర్పాటి పాండు, కిన్నెర పాండు, గంధం గోపాల్ పాల్గొన్నారు.