టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ప్రదీప్ రావు

టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ప్రదీప్ రావు

వరంగల్ : ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీలో సరైన గుర్తింపు లేనందునరాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలివ్వడంతో ఆ పార్టీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలుచేశారు. అయినా ప్రదీప్ రావు మాత్రం టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు వచ్చే సరికి టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరని అభిప్రాయపడ్డారు.

పార్టీలో గుర్తింపు లేదు 
రాజీనామా ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రదీప్ రావు.. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చినా వారికి కనీస సాయం చేయలేకపోతున్నానని వాపోయారు. టీఆర్ఎస్ లో 9ఏండ్ల పాటు క్రమశిక్షణతో ఉండి నిస్వార్థంగా పనిచేశానని, పదవులు ఇవ్వకున్నా  పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని చెప్పారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో కొనసాగడం ఎందుకన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రదీప్ రావు ప్రకటించారు. సంస్కారంలేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ప్రదీప్ రావు అభిప్రాయపడ్డారు. ఏ పార్టీలో చేరాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తానని చెప్పారు.

ఎమ్మెల్యేకు సవాల్
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సవాల్ విసిరారు. రూ.4వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటున్న ఆయన.. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. 10వ తేదీలోపు ఎమ్మెల్యే నరేందర్ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే నరేందర్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకొని ఆయన అనుచరుడిగా ఉంటానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తనను మోసం చేసిందన్న ప్రదీప్.. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి వరంగల్ తూర్పు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.