
జయశంకర్ భూపాలపల్లి: ప్రజాప్రతినిధులు, అధికారులు… పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. పట్టణంలోని 2వవార్డు కాలనీ వాసులతో కలిసి మాట్లాడారు. ప్రొఫేసర్ జయశంకర్ తెలంగాణ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని అలాంటి వారి పేరున ఉన్న జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ప్రతీఒక్కరిదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల నిధులను విడుదల చేసి, గ్రామాల, పట్టనాల అభివృద్ధికి పాటుపడుతుందని చెప్పారు. కఠినమైన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు వచ్చాయని అన్నారు. పందుల పెంపకం దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపి.. పందుల స్వైరవిహారానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణప్రగతి కార్యక్రమానికి హాజరుకాని కౌన్సలర్లు, అధికారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీచేశారు.