మాకు ఓట్లు పడవు.. కేసీఆర్ కు పడతాయి : ఎర్రబెల్లి దయాకర్

మాకు ఓట్లు పడవు.. కేసీఆర్ కు పడతాయి : ఎర్రబెల్లి దయాకర్

వరంగల్ అర్బన్ :  టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న ఈ సభలో ముమందుగా మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు… 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనను కేసీఆర్ ఒక్కరే గుర్తించారని అన్నారు. తాను చాలా మందిని ఎమ్మెల్యేలను చేసినా… టీడీపీ మాత్రం తనను గౌరవించలేదన్నారు. మంత్రిపదవి వస్తుందని తానే ఊహించలేదనీ… అందుకు కేసీఆర్, కేటీఆర్ లకు రుణపడి ఉంటానని చెప్పారు. పార్టీ కోసం‌ ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.

“ఢిల్లీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. ఆయన గెలుపుకోసం జిల్లాలో అందరినీ కలుపుకొనిపోతానని హామీ ఇస్తున్నా. మా ముఖాల్లో కల్తీ ఉంది. కానీ కేసీఆర్, కేటీఆర్ మచ్చ లేని వారు. మమ్మల్ని చూసి ఓటేస్తారో లేదో కానీ కేసీఆర్ కు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో మా నాయకుల మధ్య విభేదాలతోనే భూపాలపల్లి, ములుగు సీట్లు ఓడిపోయాం. పార్టీలో అంతర్గత విభేదాలతోనే అసెంబ్లీలో కొన్ని సీట్లు కోల్పోయాం. పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరగకుండా చూస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తాం. నాకిచ్చే బాధ్యతను ఎవరికీ ఇబ్బంది కలగకుండా సక్రమంగా నెరవేరుస్తా” అని చెప్పారు ఎర్రబెల్లి.