7 సంవత్సరాల ముందే అమెరికా హెచ్చరిక.. ఎయిర్ ఇండియా విని ఉంటే 260 మంది బతికేవారు..!

7 సంవత్సరాల ముందే అమెరికా హెచ్చరిక.. ఎయిర్ ఇండియా విని ఉంటే 260 మంది బతికేవారు..!

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణమేంటన్న దానిపై మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. విమానంలోని ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‎ల్లో అనూహ్య మార్పుల వల్లే ప్లయిట్ క్రాష్ అయినట్లు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) తేల్చింది. దాదాపు 260 మంది చావులకు కారణమైన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు చేపట్టింది. ఈ విషాద ఘటన జరిగిన సరిగ్గా నెల రోజులకు (జూలై 12) ప్రమాదానికి కారణమేంటనే దానిపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక సమర్పించింది.

 మొత్తం 15 పేజీలతో కూడిన ఈ రిపోర్టులో ప్రమాదానికి దారితీసిన సాంకేతిక సంఘటనలు, కాక్‌పిట్ సంభాషణలను ఏఏఐబీ వెల్లడించింది. ప్లయిట్ టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఫ్యూయెల్ స్విచ్‎లు రన్ మోడ్ నుంచి కటాఫ్ మోడ్‎లోకి వెళ్లాయి. దీంతో విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఫ్యూయెల్ అందక విమానం రెండు ఇంజన్లు ఆగిపోయి ప్లయిట్ క్రాష్ అయ్యిందని ప్రాథమిక నివేదికలో తేల్చింది ఏఏఐబీ. 

అయితే.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణమైన ఫ్యూయెల్ స్విచ్‎ల్లో అనూహ్య మార్పుల సమస్యను 2018లోనే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) గుర్తించింది. బోయింగ్ 737 జెట్‌లలో ఫ్యూయెల్ స్విచ్‎లు సడెన్‎గా ఆఫ్ అయ్యే టెక్నికల్ ప్రాబ్లమ్‎ను ఏడు సంవత్సరాల క్రితమే ఐడెంటిఫై చేసింది. 2018 డిసెంబర్‎లో యూఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ స్పెషల్ ఎయిర్‌వర్తినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ (SAIB) ఒకటి విడుదల చేసింది. ఇందులో కొన్ని బోయింగ్ 737 విమానాలలో ఇంధన నియంత్రణ స్విచ్‌ల లాకింగ్ ఫీచర్‌లో సమస్య ఉన్నట్లు ఎఫ్ఏఏ తెలిపింది. 

ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 జెట్‌లో కూడా ఇదే స్విచ్ డిజైన్‌ను ఉపయోగించారు. కానీ ఈ సమస్యను అప్పట్లో ఎయిర్ లైన్స్ యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుని వదిలేశాయి. కానీ 2018లో ఎఫ్ఏఏ గుర్తించిన సమస్యే.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరగడానికి దారి తీసింది. ఎఫ్ఏఏ బులెటిన్ ఫాలో కావడం తప్పనిసరి కాదు. జస్ట్ సూచన మాత్రమే. దీంతో ఎయిర్ ఇండియా ఎఫ్ఏఏ సిఫార్సు చేసిన తనిఖీలను నిర్వహించలేదు. చివరకు అదే కారణంతో విమాన ప్రమాదం జరిగి దాదాపు 260 మంది చనిపోయారు. దీంతో ఎఫ్ఏఏ లేవనెత్తిన సమస్యపై చర్చ మొదలైంది. 

ALSO READ : Tariff Bomb: రష్యా నుంచి ఆయిల్ కొంటే.. ఇండియాపై పన్నుల మోత మోగిస్తా : ట్రంప్ వార్నింగ్

కాగా, 2025, జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే జనవాసాల మధ్య కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందగా.. మెడికల్ కాలేజీ భవనంపై ఫ్లైట్ కుప్పకూలడంతో అందులోని కొందరు మరణించారు.