శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పరి'పై విమర్శల దాడి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. కారణం ఇదే!

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పరి'పై విమర్శల దాడి..  సోషల్ మీడియాలో ట్రోలింగ్.. కారణం ఇదే!

భారతీయ సినిమాకు సరికొత్త ఒరవడిని సృష్టించిన దర్శకుడు ఎస్. శంకర్ (S. Shankar) . ఈ పేరు వింటే చాలు  భారీ బడ్జెట్, విజువల్ వండర్స్, సామాజిక సందేశాలు గుర్తుకొస్తాయి. 'జెంటిల్‌మన్', 'భారతీయుడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌లను అందించిన శంకర్, ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పరి' (Velpari) గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. 'అవతార్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వంటి హాలీవుడ్ దిగ్గజాల స్థాయిలో 'వేల్పరి' ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందే సామర్థ్యం ఉందని ఆయన పేర్కొనడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

'వేల్పరి' కల..  ఒక చారిత్రక నవల ఆవిష్కరణ!
తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ, "'ఎంతిరన్' ( రోబో ) నా గత డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పుడు 'వేల్పరి' నా కలల చిత్రం. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'అవతార్' వంటి కొత్త టెక్నాలజీలను పరిచయం చేసే అవకాశం దీనికి ఉంది. 'వేల్పరి' తమిళ సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు కూడా గర్వకారణంగా నిలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించగలదు. ఈ కల నిజమవుతుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు. 

 

వరుస ఆపజయాలతో విమర్శలు..
అయితే, శంకర్ ఈ గొప్ప విజన్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు.  ఆయన ఇటీవలి చిత్రాలైన 'గేమ్ ఛేంజర్', 'ఇండియన్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ చిత్రాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కినా, వాణిజ్యపరంగా నిరాశపరిచాయి.  ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌లుగా నిలిచి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దీంతో కొందరు సోషల్ మీడియాలో శంకర్ విజన్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  నిర్మాత దిల్ రాజు సహా కొందరు సినీ ప్రముఖుల వ్యాఖ్యలు కూడా ఈ విమర్శలకు ఆజ్యం పోశాయి. ఇప్పుడు తన తదుపరి చిత్రం 'వేల్పరి' (Velpari) గురించి చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌కు గురవుతున్నారు.

సోషల్ మీడియలో ట్రోలింగ్.. 
ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పరి' (Velpari) గురించి శంకర్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరొసారి విమర్శలు ఎదుర్కొంటున్నారు.   ఒక X (ట్విట్టర్) యూజర్, "ఈ సినిమా తర్వాత నిర్మాత బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. కనీసం తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నించండి సార్. మీరు చాలా డబ్బు వృధా చేస్తారు! పాటల కోసమే 75 కోట్లు ఎవరు ఖర్చు చేశారు?" అని రాశారు. మరొకరు, "#శంకర్ అధిక బడ్జెట్ సినిమాలు తీయడం ఆపితే మంచిది. నిర్మాతలకి భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. ఆయన చివరి 3-4 సినిమాలు దారుణంగా పడిపోయాయి" అని వ్యాఖ్యానించారు.  ఒకవేళ సినిమా తీయాలనుకుంటే, సొంత డబ్బుతో నిర్మించి, ఎవరి భాగస్వామ్యం లేకుండా విడుదల చేయాలి" అని ఇంకొకరు వ్యంగ్యంగా రాశారు. మరి ఈ విమర్శలకు శంకర్ ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి..