గద్వాల ఓటర్ లిస్ట్.. గందరగోళం!.. ఇంటి నంబర్ల స్థానంలో ప్లాట్ నంబర్లు

 గద్వాల ఓటర్ లిస్ట్.. గందరగోళం!.. ఇంటి నంబర్ల స్థానంలో ప్లాట్ నంబర్లు

 

  •  కొన్ని  చోట్ల డబుల్​ ఓట్లు నమోదు
  •  ఓటర్​ లిస్టులో మృతుల పేర్లు
  •  సరిచేయాలంటూ కలెక్టర్​కు నాయకుల ఫిర్యాదు

గద్వాల, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో విడుదలైన గద్వాల ముసాయిదా ఓటరు జాబితా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇంటి నంబర్ల స్థానంలో ప్లాట్ నంబర్లు, నెల, -తేదీ నంబర్లతో ఓటర్ల పేర్లు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని వార్డుల్లో ఓటర్లు అధికంగా, మరికొన్ని వార్డుల్లో తక్కువగా ఓటర్లు నమోదుకావడంతో పాటు, గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లు కూడా గద్వాల టౌన్‌‌‌‌లో నమోదయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

తప్పుల తడకలా..

ఓటరు జాబితాలో మున్సిపల్ ఆఫీసర్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంటి నంబర్లతో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా అదేమీ పాటించలేదు. ప్లాట్​ నంబర్లతో గద్వాల టౌన్​లో దాదాపు 5 వేల మంది ఓటర్లను చేర్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా దౌదర్ పల్లి ఏడో వార్డులో ఇంటి నంబర్ల స్థానంలో నెల, తేదీలు నంబర్లుగా ఉన్నాయి. ఆ ఇంటి నెంబర్ ఎవరిది, ఆ వ్యక్తి ఎవరనే విషయాలు తెలియకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

ఓటర్ల విభజన అస్తవ్యస్తం..

గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. ముసాయిదా ఓటర్ జాబితా ప్రకారం గద్వాలలో 65,370 ఓటర్లు ఉన్నారు. ఇందులో కొన్ని వార్డులలో మరీ ఎక్కువగా, మరికొన్ని వార్డుల్లో మరీ తక్కువగా ఓటర్లను చేర్చడంపై విమర్శలు వస్తున్నాయి. 3, 7, 13, 16, 17, 18, 30 వార్డుల్లో భారీగా రెండు వేల పైచిలుకు ఓట్లు నమోదయ్యాయి. 

మృతుల పేర్లు తొలగించలే..

ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. అలాగే డబుల్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 34వ వార్డులో 15 మంది చనిపోయిన వారి పేర్లు కనిపిస్తున్నాయి. 50 వరకు డబుల్ ఓటర్లుగా నమోదయ్యాయి. 33వ వార్డులోనూ ఇదే పరిస్థితి. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వేసిన వారు కూడా మున్సిపాలిటీ జాబితాలో ఓటర్లుగా ఉండడం 
గమనార్హం.

అన్నింటిని సరిచేస్తాం

ఫీల్డ్ విజిట్ చేసి అన్ని అభ్యంతరాలను పరిశీలించి సరిచేస్తాం. అన్ని వార్డులకు సమానంగా ఓటర్లను విభజించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తుది ఓటర్ జాబితా సిద్ధం చేస్తాం. ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తపడతాం.-  జానకిరామ్ సాగర్, మున్సిపల్ కమిషనర్, గద్వాల్