- ఆరు లేన్ల విస్తరణతో పెరిగిన అంచనా వ్యయం
- కేంద్రానికి పంపిన ఎన్‌హెచ్ఏఐ
- టెండర్ల గడువు సెప్టెంబర్ 3 వరకు పెంపు
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ ( ట్రిపుల్ఆర్) నార్త్ పార్ట్ అంచనా వ్యయం పెరిగింది. మొదట ఈ రూట్‌ను 4 లేన్లుగా నిర్మించాలని నిర్ణయించారు. భూసేకరణ, రోడ్డు నిర్మాణ ఖర్చు మొత్తం రూ. 7,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుతుందన్న నేపథ్యంలో 6 లేన్లకు విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వ వినతికి కేంద్రం అంగీకరించింది. అనంతరం ట్రాఫిక్ సర్వే నిర్వహించి 6 లేన్ల విస్తరణకు గ్రీన్ సిగ్రల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఏఐ ( నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ) 6 లేన్ల నిర్మాణానికి ఖర్చును అంచనా వేయగా రూ. 9 వేల కోట్లకు చేరిందని అధికారులు చెబుతున్నారు.
పెరిగిన అంచనా వ్యయానికి సంబంధించి పూర్తి వివరాలను కేంద్ర ఉపరితల రవాణా శాఖకు ఎన్‌హెచ్ఏఐ అధికారులు ఇటీవల పంపారు. కాగా, 4 లేన్ల విస్తరణలో 161.5 కిలో మీటర్ల నిర్మాణానికి భూసేకరణ పూర్తి కాగా.. నిరుడు డిసెంబర్ లో 4 ప్యాకేజీలుగా డివైడ్ చేసి కేంద్రం టెండర్లు పిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లానుంచి నార్త్ పార్ట్ స్టార్ట్ అయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో ముగియనున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు విధించగా కేంద్ర కేబినెట్‌లో ఈ ప్రాజెక్టు ఆమోదం పొందకపోవడంతో అప్పటి నుంచి టెండర్ గడువు పొడిగిస్తున్నారు. కేబినెట్‌లో ఆమోదించిన తర్వాతే టెండర్లను ఎన్‌హెచ్ఏఐ అధికారులు ఓపెన్ చేయనున్నారు. తాజాగా మరోసారి టెండర్ల గడువును సెప్టెంబర్ 3 వరకు పెంచారు.
