కుమురం భీం జిల్లాలో విషాదం..పిడుగుపాటుకు భార్యాభర్తలతో సహా ముగ్గురు మృతి

  కుమురం భీం జిల్లాలో విషాదం..పిడుగుపాటుకు భార్యాభర్తలతో సహా ముగ్గురు మృతి

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో కురిసిన గాలివాన తీవ్ర విషాదాన్ని నింపింది.కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. జిల్లాలోని రెబ్బెన మండలం ఖైరీగూడ శివారులో ఉన్న చేనులో పని చేసుకుంటుండగా... ఒక్కసారిగా పిడుగు పడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.

మరోవైపు ఆసిఫాబాద్ మండలం కౌటాగూడలోనూ పిడుగుపాటుకు మరో ప్రాణం పోయింది. గ్రామానికి చెందిన పటేల్ పెందుర్ లింగు అనే వ్యక్తిపై పిడుగు పడటంతో ఆయన మరణించారు. ఒకే రోజు జిల్లాలో ముగ్గురు మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. ధర్మారం మండలం నందిమేడారంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడ్డాయి. ధర్మారం - పెద్దపల్లి ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు యుద్ధప్రాతిపదికన చెట్లను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.