బ్యాక్ టు బ్యాక్  టైటిల్స్ కొట్టిన ఆర్సీబీ.. చెన్నై, ముంబై క్లబ్‌లోకి బెంగళూరు ఎంట్రీ

బ్యాక్ టు బ్యాక్  టైటిల్స్ కొట్టిన ఆర్సీబీ.. చెన్నై, ముంబై క్లబ్‌లోకి బెంగళూరు ఎంట్రీ

RCBvsGT: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ ని ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండుసార్లు (బ్యాక్-టు-బ్యాక్) టైటిల్స్ గెలుచుకున్న మూడో జట్టుగా ఆర్‌సీబీ సరికొత్త రికార్డును తన పేరుపై లిఖించుకుంది. ఐపీఎల్ ప్రారంభమై 18 సీజన్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేవలం రెండు జట్లు మాత్రమే తమ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకోగలిగాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆర్‌సీబీ కూడా అడుగు పెట్టింది. ఐపీఎల్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు ట్రోఫీని గెలుచుకున్న నాలుగో జట్టుగా కూడా బెంగళూరు నిలిచింది. 

ఆ ట్రోల్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్: 
ఐపీఎల్ ట్రోఫీని మొదటిసారి ముద్దాడటానికి ఆర్‌సీబీ జట్టుకు, విరాట్ కోహ్లీకి ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. ప్రతి సీజన్‌లోనూ "ఈ సాలా కప్ నమ్దే" అంటూ రావడం.. కీలక దశలో ఓడిపోవడంతో సోషల్ మీడియాలో ఆర్‌సీబీపై విపరీతంగా ట్రోల్స్ వచ్చేవి.. కానీ గత ఏడాది (2025 సీజన్) కప్పు గెలిచి విమర్శకుల నోళ్లు నొక్కేసిన ఆర్‌సీబీ.. ఇప్పుడు 2026లో కూడా టైటిల్ కొట్టి, తమ మొదటి విజయం ఏదో అదృష్టం (Fluke) వల్ల వచ్చింది కాదని ప్రపంచానికి చాటిచెప్పింది. 

►ALSO READ | ఫైనల్‌లో కోహ్లీ షో.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి కప్పు కొట్టిన ఆర్సీబీ

ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు కప్పు కొట్టిన జట్లు ఇవే: 
గతంలో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2010లో ముంబై ఇండియన్స్ జట్టుని, 2011లో ఆర్‌సీబీని ఓడించి తొలిసారి బ్యాక్-టు-బ్యాక్ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై 2019లో చెన్నైపై కేవలం 1 రన్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి, 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రెండోసారి ఈ ఫీట్ సాధించింది. ఇప్పుడు వారి తర్వాత రజత్ పాటిదార్ కెప్టెన్సీలో, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆర్‌సీబీ ఈ అరుదైన రికార్డు క్లబ్‌లో జాయిన్ కావ్వడంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.