
- వరద ముంపుతో మరింత పెరిగే అవకాశం: మంత్రి తుమ్మల
- నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
- గత పదేండ్లలో రైతులను పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు
- సర్కారుపై బురద జల్లేందుకే బీఆర్ఎస్ లీడర్ల విమర్శలు
ఖమ్మం, వెలుగు:భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారిక అంచనాల ప్రకారం 1,53,278 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇంకా చాలా జిల్లాల్లో పంటలు వరద నీటిలోనే మునిగి ఉండడంతో నష్టం ఇంకా పెరిగే అవకాశముందని ఆయన చెప్పారు. పూర్తి పంట నష్టం నివేదిక అందగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు.
మంగళవారం ఖమ్మంలోని తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వానాకాలంలో 1,16,97,252 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మిర్చి, కంది లాంటి పంటలను వేసుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటోతేదీన కురిసిన భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో పంటలు వరద ముంపునకు గురయ్యాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ చెరువులకు గండ్లు పడడం, వరద ప్రవాహం అమాంతం పెరగడం వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు.
ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 68,345 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 34,149 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 25,275 ఎకరాలు, వరంగల్, నారాయణపేట జిల్లాల్లో 6 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో రైతులు కొత్త పంటలు వేసుకునేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు.
పదేండ్లు విస్మరించి.. ఇప్పుడు విమర్శలా..?
రాష్ట్రంలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు ఏనాడూ పంట నష్టంపై నోరెత్తకుండా.. రైతులను ఆదుకోకుండా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల ఫైర్అయ్యారు. గోదావరి వరదలు వచ్చిన సమయలో, వడగండ్లు పడి పంటలు పూర్తిగా నష్టపోయినా నోరుమెదపని వారు, ఇప్పుడు ఎకరానికి రూ.30వేలు ఇవ్వాలని మాట్లాడుతున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో కావాలని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.
గతంలో పంట నష్టం జరిగితే పరిహారం అటుంచి, కనీసం పరామర్శించడానికి కూడా పోలేదన్నారు. మున్నేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.
కొంత మంది ప్రతిపక్ష నేతలు ముంపు ప్రాంతాలకు వచ్చి బురద రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధిచెప్తారన్నారు. సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.