మాటల ఈటెలు..రోజుకో సంచలన కామెంట్

మాటల ఈటెలు..రోజుకో సంచలన కామెంట్
  • పంట కొనుగోళ్లకుఐకేపీ సెంటర్లుఉండాలని డిమాండ్
  • డబ్బున్నోళ్లకు రైతుబంధు వద్దని సూచనలు
  • కేంద్ర పాలసీలపై సొంతంగా విమర్శలు
  • సీఎం పోస్టుకు ఈటల బెటరంటున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్, వెలుగు: హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ కొద్దిరోజులుగా వివిధ అంశాలపై తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొడుతున్నారు. ఇటీవల తన నియోజకవర్గంతోపాటు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ఘాటుగా స్పందించారు. రైతుబంధు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, కేంద్రం చేసిన రైతు చట్టాలు, కేంద్ర బడ్జెట్​పై వరుసగా ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ‘బడ్జెట్​ బాగుంది.. రైతు చట్టాలు అవసరమే, కొన్ని సవరణలు చేస్తే సరిపోతుంది’అని టీఆర్ఎస్​ పార్లమెంటరీ పార్టీ లీడర్​ కె.కేశవరావు రాజ్యసభలో మాట్లాడారు. మరికొందరు గులాబీ లీడర్లు కూడా కేంద్ర బడ్జెట్​ బాగుందన్నట్టుగా సంకేతాలు ఇస్తుంటే.. మంత్రి ఈటల కేంద్ర బడ్జెట్​ బాగలేదని విమర్శించారు.

ఐకేపీ కేంద్రాల్లేకుంటే ఎట్లా?

ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబోమని సీఎం కేసీఆర్​ కొద్దిరోజుల కింద స్పష్టం చేశారు. అయితే ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలు ఉండాల్సిందేనని ఈటల స్పష్టం చేశారు. ‘రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కువ దూరం వెళ్లడం కష్టం. ఊర్లలో ఐకేపీ సెంటర్లు పెట్టుకున్నం. ఇప్పుడా సెంటర్లలో కొనకపోతే ఎట్లా?’అని ఈటల పేర్కొన్నారు. ‘ఇవాళ కేసీఆర్​ ఉన్నా లేకపోయినా, నేను మంత్రిగా ఉన్నా లేకపోయినా రైతులకు అండగా ఉంటా..’ అంటూ ఈటల చేసిన కామెంట్లు పెద్ద చర్చకు దారితీశాయి. మరోచోట మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ధాన్యం కొంటరో, లేదోనని రైతులు భయపడ్తున్నరని ఈటల చెప్పారు. రైతుల అభిప్రాయాలను వినిపించడం తన బాధ్యత అన్నారు. సీఎం కేసీఆర్​కు నేరుగా చెప్పగలిగే చనువు తనకు ఉందని కూడా పేర్కొన్నారు.

రైతుబంధు ధనవంతులకు ఇవ్వొద్దు

రైతుబంధు స్కీమ్ లో షరతులు విధించాలని ఈటల రాజేందర్ ఇటీవల అభిప్రాయపడ్డారు. ‘రైతు బంధు స్కీమ్​ మంచిదేగానీ ఇన్ కం ట్యాక్స్ కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ చేసే భూములకు, వ్యవసాయం చెయ్యని గుట్టలకు, లీజుకిచ్చే భూములకు రైతుబంధు ఇవ్వొద్దు’అని పేర్కొన్నారు.

బీసీల గొంతు వినిపిస్తూ..

ఇటీవల జరిగిన బీసీల మీటింగ్​లోనూ ఈటల తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కులాలు మన దేశంలో ఉన్నాయని, అయితే తెలివి ఒక్క కులానికే పరిమితం కాదని స్పష్టం చేశారు. బీసీల్లో ఉన్న చైతన్యం, పోరాట పటిమ వృథా పోదని, వచ్చిన అవకాశాలను వినియోగించుకుని తమను తాము ప్రూవ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీని సీఎం చేయా లంటూ ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్న టైంలో ఈ  కామెంట్లు ఆసక్తిగా మారాయి.

సీఎం పదవికి ఈటల సమర్థుడు

కేటీఆర్ ను సీఎం చేయాలని టీఆర్ఎస్ లీడర్లు డిమాండ్ చేస్తున్న టైంలో ప్రతిపక్షాల నేతలు కొందరు ఈటల పేరును తెరపైకి తెచ్చారు. ఉద్యమ కాలం నుంచీ పార్టీలో ఉన్న ఈటలను సీఎం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సీఎం పదవికి ఈటల సమర్థుడని కితాబు ఇచ్చారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్ కూడా ఈటలను సీఎం చేయాలని కామెంట్​ చేశారు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ మల్లు రవి కూడా సీఎం పదవికి ఈటల రాజేందర్​ కరెక్ట్​ పర్సన్​ అని పేర్కొన్నారు. మరోవైపు కొంతకాలంగా రాష్ట్రంలో బీసీని సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీసీ సంఘాల నేతలు తరచూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన బీసీల సభలో ‘తెలంగాణ ఉద్యమంలో ఈటల కీలక పాత్ర పోషించారు. బీసీ వర్గాల నుంచి ఈటల సీఎం కావాలి’ అని కొందరు నేతలు కోరుకోవడం గమనార్హం.