రోజుకో అబద్ధం పుట్టిస్తున్నరు

రోజుకో అబద్ధం పుట్టిస్తున్నరు
  • తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు: ఈటల
  • కేసీఆర్ గైడెన్స్​లోనే గోబెల్స్​ ప్రచారం
  • హుజూరాబాద్​లో బీజేపీ గెలుస్తుందని ధీమా

హుజూరాబాద్, వెలుగు:‘రోజుకో అబద్ధాన్ని పుట్టిస్తున్నరు.. తప్పుడు లెటర్లు సృష్టిస్తున్నరు.. రెండు నెలల నుంచి సీఎం కేసీఆర్​ కనుసన్నల్లో నా మీద గోబెల్స్​ ప్రచారం చేస్తున్నరు.. నేనేమిటో ఇక్కడి ప్రజలకు తెలుసు.. ఈ చిల్లర ప్రచారాన్ని జనం నమ్మరు’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హుజూరాబాద్​లో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్​చార్జిల మీటింగ్​లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలను తాను వ్యతిరేకిస్తున్నట్టు నియోజకవర్గంలోని రైతులకు పల్లా రాజేశ్వర్ రెడ్డి లేఖలు రాశాడని, ఈటల ఎవరి పక్షాన ఉంటారో ఇక్కడి రైతులకు, ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. సాగులో లేని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ల భూములకు రైతుబంధు ఇవ్వొద్దని మాత్రమే తాను చెప్పానని, పేద రైతులకు ఇవ్వొద్దని ఎప్పుడూ అనలేదని వివరించారు. మూడేండ్లుగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వకపోవడంవల్ల పేదలు నష్టపోతున్నారని చెప్పారు. మావోయిస్టుల పేరుతో కూడా ఫేక్ లెటర్ సృష్టించారని, ఒక కులం, ఒక వర్గం ఓట్లు అక్కరలేదని తాను అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ని, రేవంత్ రెడ్డిని తాను ఏదో అన్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 20 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను విజ్ఞత లేకుండా మాట్లాడతానా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న జిమ్మిక్కులను నమ్మవద్దని ఆయన కోరారు.
పోలీసులు ప్రజల్ని బెదిరిస్తున్నరు
పోలీసులు, ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని, ఇష్టమెచ్చినట్టు పని చేస్తామంటే కుదరదని అన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులు ఇంటింటికి తిరిగి ప్రజలను భయపెడుతున్నారని, ఐదారేండ్ల కిందటి కేసులను తిరగదోడుతున్నారని ఆరోపించారు. పువ్వు గుర్తు స్టిక్కర్ ఉన్న వెహికల్స్ మీద కేసులు పెడుతున్నారని, ఇలాంటి పిచ్చి పనులు ఆపకుంటే వాళ్లే బలవుతారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తరువాత టీఆర్​ఎస్​ పవర్​లో ఉండదన్నారు. ఉప ఎన్నికలో పని చేయడానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏక్ దిన్ కా సుల్తాన్ లని, వాళ్లు చేసేదేం ఉండదన్నారు. ఇది ఎన్నికల కోసం పని చేసే ప్రభుత్వమేకానీ, ప్రజల కోసం పని చేసేది కాదన్నారు. హుజురాబాద్​లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.

తనకు జీహుజూర్​ అనే వాళ్లనే కేసీఆర్​ వెంట ఉంచుకున్నారని, ఉద్యమకారుడైన ఈటల రాజేందర్​ను తప్పుడు ఆరోపణలతో బయటికి పంపించారని హుజూరాబాద్ ఉపఎన్నికల బీజేపీ ఇన్ చార్జి జితేందర్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని, దళితుడినే సీఎం చేస్తానన్న హామీ ఎటోపోయిందని, ఇప్పుడు దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. చింతమడక ప్రజలు ఇప్పటికీ రూ.10 లక్షల కోసం ఎదురుచూస్తున్నారని, డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు వస్తాయని చాలామంది ఇండ్లు కూలగొట్టుకున్నారని, ఫస్ట్ వాళ్ల సంగతి చూడాలని సీఎంకు సూచించారు. హుజూరాబాద్​లో టీఆర్ఎస్​కు అభ్యర్థే లేరని, ఇక్కడ ఈటల విజయం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్​ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మార్తినేని ధర్మారావు, ఏలేటి చంద్రశేఖర్, వొన్నాల శ్రీరాములు  తదితరులు పాల్గొన్నారు.