చిన్నోళ్లమో..పనికిమాలినోళ్లమో ప్రజలే తీర్పు చెబుతారు 

చిన్నోళ్లమో..పనికిమాలినోళ్లమో ప్రజలే తీర్పు చెబుతారు 
  • మాజీ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్: మేం చిన్నోళ్లమో.. పనికిమాలినోళ్లమో ప్రజలే తీర్పు ఇస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇల్లందకుంట మండలం కనగర్తిలో పాదయాత్ర సందర్భంగా తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామితో ఫోన్ లో మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ఈటల రాజేందర్ స్పందించారు. ‘‘ఇంతకు ముందే హుజురాబాద్ లో ఓ వ్యక్తితో కేసీఆర్ మాట్లాడారు. ఆయనతో ఈటల రాజేందర్ ఓ చిన్న మనిషని చెబుతున్నాడు. నేను చిన్నమనిషినే, కొట్లాడేవాళ్లంతా చిన్నోళ్లో.. ఆయనో పెద్ద మేధావి,  పెద్దమనిషి..  కానీ బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చస్తుందని గుర్తుంచుకో.. కానీ మేమ నీ దృష్టిలో చిన్నవాళ్లమే కావచ్చు. కానీ రోషం గల బిడ్డలం చిచ్చరపిడుగుల్లా కొట్లాడేవాళ్లం.. ఆనాడు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినోళ్లం..’’ అంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. 
‘‘మేము చిన్నోళ్లమని, పనికిమాలినోళ్లమని అనొచ్చు. మేము పనికి మాలినోళ్లం కాదని... హుజురాబాద్ గడ్డ ఎన్నికల్లో గుద్దుడు గుద్దుతరు.. మేము చిన్నోళ్లం కాదని, పనికిమాలినోళ్లం కాదని వాళ్లే తీర్పునిస్తారు. మీరు బీ-ఫారం ఇస్తేనే అందరూ గెలవరు. నీ ఫొటో పెట్టుకుంటే గెలవరు. అలా అయితే నీ బిడ్డ ఎందుకు ఓడిపోయింది. ప్రజలకు సేవచేసే నాయకులుంటేనే గెలుస్తారు.. ఆరు రోజులుగా నాకళ్లన్నీ గుంజుతున్నాయ్.. అయినా ప్రజలు నీ శ్రమ వృథా పోదని చెబుతున్నారు. గుడిసెలో ఉన్నోడికైనా, బంగ్లాలో ఉన్నోడికైనా ఓటుహక్కు ఒక్కటే. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఓటును నాకు వేయండని అడుగుతున్నా. వందల కోట్లు ఖర్చు పెట్టినా, గోర్లు, కమ్యూనిటీ హాళ్లు, దళిత బంధు ఇచ్చినా... అవన్నీ నావల్లే వస్తున్నాయి.. ఓ యాదవ బిడ్డ నీ గొర్రు లేకున్నా మంచిదే కానీ రాజేందర్ కే ఓటేస్తామని చెప్పాడు.. ఈసారి జెండాలు, పార్టీలు పక్కన పెట్టి మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించండి..’’ అని ఈటల రాజేందర్ కోరారు. 
గతంలో 70 శాతం ఇప్పుడు మొత్తం: ఈటల
గతంలో కనగర్తి గ్రామంలో 70 శాతం ఓట్లేసారు. ఇప్పుడు మొత్తం వేయమని అడుగుతున్నా.. కేసీఆర్ కుట్రలను చేధించే శక్తిని నాకీయండి..ఈ రాష్ట్రంలో నేను తిరగని జిల్లా లేదు. స్వీకరించని దరఖాస్తు లేదు.. సమైక్య రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు కష్టాలున్నా, కన్నీళ్లున్నా నాకు చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించమని చెప్పేవాళ్లు.. అనాడైనా, ఈనాడైనా ప్రజల కష్టాల వైపు.. వాటిని పరిష్కరించే వైపే ఉండాలనుకున్నా.. లేకుంటే నేను చరిత్ర హీనున్నైతా. అందుకే నేను పార్టీని వీడాల్సి వచ్చింది..’’ అని ఈటల వివరణ ఇచ్చారు.   
నేను కరోనా విధుల్లో ఉంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూసుని నాపై కుట్ర: ఈటల
కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రినైన తనపై గురుతర బాధ్యత ఉండడంతో ఎంతో మంది భయపెట్టినా.. నేను ధైర్యంగా కష్టాల్లో ఉన్న ప్రజల కోసం కరోనా విధుల్లో ఉన్నానని.. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రి చుట్టూ, కోవిడ్ సెంటర్ల చుట్టూ తిరిగానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ‘‘కరోనా మనుషులను మాత్రమే చంపలేదు. మనుషుల జీవితాల్లో మట్టి కొట్టింది. అనేక మంది, ఎన్నో కుటుంబాలు లక్షల రూపాయల అప్పుల్లో మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి బాధితులను ఆదుకునే విధుల్లో నేనుంటే కేసీఆర్.. ఫామ్ హౌస్ లో కూర్చుని నాపై కుట్ర చేసారు.. తెలంగాణ గర్వించే బిడ్డగా, మంత్రిగా ఎంతో కష్టపడ్డా.. నేను ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకున్నాను తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు.. ’’ అని ఈటల అన్నారు.
‘‘ఆనాడు కేసీఆర్ వెంట ఉద్యమంలో పాల్గొన్న బొడిగె శోభ, నేను ఎక్కడున్నాం.. నాకు కష్టం ఉందని ఎవరు నాదగ్గరకు వచ్చినా... కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఆదుకున్నా.. 18 సంవత్సరాలుగా ప్రజల కాలికి ముళ్లు విరిగితే పన్నుతో పీకాను. ఆరుసార్లు గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు. నేనట దొంగపని చేసానని చెబుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. నా భార్య కోళ్లఫారం నడుపుతోంది. నేను ఆనాడు శ్రమపడితేనే కదా.. జైలుకెళ్లిన ఉద్యమకారులకు బెయిళ్లు దొరికాయి. సభలు, సమావేశాలకు వచ్చినోళ్లకు తిండి పెట్టాను కదా. ఆనాడు నేను మంచోన్నైనా.. ఇప్పుడు ఎందుకు చెడ్డోన్నైనా.. ? అని ఈటల ప్రశ్నించారు. ‘‘నా దగ్గర ఒక్క ఎకరం అక్రమంగా ఉన్నా... ఎంక్వైరీ చేయించి శిక్షవేయి. లేదంటే చెంపలు వేసుకోవాలి.. కొంతమంది కిరాయి వ్యక్తులతో మాట్లాడిస్తున్నావు. ఇలాంటి కుట్రలకు నేను వెరవను, భయపడను. 2018లో నన్ను ఓడించేందుకు కుట్ర జరిగినా మీకు చెప్పలేదు.. ఆనాటి కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు ఏ పార్టీలో చేరాడో చూసారు. ఆనాడే అగ్రిమెంట్ చేసుకుని ఈటల రాజేందర్ ను ఓడించడానికి ఎన్ని డబ్బులు కావాలని అడిగి ఇచ్చారు. నేనేమో టీఆర్ఎస్ జెండా పట్టుకుని ఓట్లడిగితే.. వాళ్లేమో వేరే పార్టీ వాళ్లకు డబ్బులిచ్చి నన్ను ఓడించాలనుకున్నారు. కంచె చేను మేసిన చందంగా వ్యవహరించినా.. నన్ను మీరే గెలిపించారు. 90 సీట్లు గెలిచి కూడా మూడు నెలల పాటు మంత్రి వర్గాన్ని విస్తరించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసాడు కేసీఆర్. గతంలో సర్పంచి రికమెండ్ చేసినా ఫించన్ ఇచ్చేవారు. కానీ మంత్రి చెప్పినా మూడేళ్లుగా ఫించన్లు లేవు. ఇప్పుడు మాత్రం నన్ను ఓడగొట్టాలని హుజురాబాద్ లో 11 వేల మందికి ఫించన్లు మంజూరు చేసారు. ఒక్క హుజురాబాద్ ఎందుకు? రాష్ట్రమంతా ఫించన్లు ఇవ్వాలి. వాళ్లకు ప్రజలపై కాదు.. ఓట్లపై ప్రేముంది. దళితబంధు హుజురాబాద్ లో ఇంటికి పది లక్షలు ఇస్తారట..’’ అని ఈటల వివరించారు.