26 ఏండ్ల నుంచి ఎత్తం వాసుల తిప్పలు

26 ఏండ్ల నుంచి ఎత్తం వాసుల తిప్పలు
  • ఊరు నుంచి తహసీల్దార్​ ఆఫీసుకు పాదయాత్ర

కొల్లాపూర్​ (నాగర్​కర్నూల్​) వెలుగు : 26 ఏండ్ల కింద ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లకు స్థలం చూపించమని 200 మంది లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో విసిగిపోయి శుక్రవారం ఏకంగా మండల కేంద్రానికి పాదయాత్ర నిర్వహించారు. నాగర్​కర్నూల్ ​జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో 26 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 200 మంది పేదలకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చింది. కానీ, స్థలం గుర్తించి పొజిషిన్ ​చూపిస్తే  గుడిసెలు అయినా వేసుకుందాం అనుకుంటే ఆ పని చేయడం లేదు. దీంతో పట్టాలు పట్టుకుని శుక్రవారం 9 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్​ను ముట్టడించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సాయిని వరలక్ష్మి, ఎంపీటీసీ శ్రీనివాస రావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసింహ మాట్లాడుతూ 1996లో అప్పటి ప్రభుత్వం ఎత్తం గ్రామంలో 200 మందికి ఇంటి స్థలాలకు సంబంధించి పట్టాలు ఇచ్చిందని, ఇప్పటివరకు స్థలం చూపించడం లేదన్నారు. ఎందరో తహసీల్దార్లు, ఆర్డీఓలు న్యాయం చేస్తామని చెప్పి, ఆ తర్వాత  మర్చిపోయారన్నారు. తమను పట్టించుకునేవారే లేరన్నారు. కొద్దిసేపటికి యథావిధిగా తహసీల్దార్​కు స్థలాలు చూపాలని వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు.