
- 15 శాతం టారిఫ్‌కు ఇరు దేశాల అంగీకారం
ఫ్రాంక్ ఫర్ట్: అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. 15 శాతం టారిఫ్‌కు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయ్న్ ప్రకటించారు. తాజాగా కుదిరిన ఒప్పందంలో భాగంగా అమెరికాలో దిగుమతి అయ్యే ఈయూ ఉత్పత్తులపై 15 శాతం ఇంపోర్ట్ ట్యాక్సెస్ విధిస్తారు.
దీంతో అమెరికాలో ఆ ఉత్పత్తులు లేదా వస్తువుల ధరలు పెరిగి వినియోగదారులపై భారం పడనుంది. అదే సమయంలో ఈయూ కంపెనీలు, వాటి పార్ట్ నర్ లు లాభపడనున్నాయి. కార్లు, కంప్యూటర్ చిప్స్, ఫార్మస్యూటికల్స్ వంటి వస్తువులపై 15 శాతం టారిఫ్ వేయనున్నారు. అంతకుముందు 50 శాతం టారిఫ్ వేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. తర్వాత క్రమంగా 50 నుంచి 30, 20 శాతానికి వచ్చారు. చివరకు 15 శాతానికి డీల్ కుదుర్చుకున్నారు. కాగా.. ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, కొన్ని రకాల కెమికల్స్, సెమికండక్టర్ పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, సహజ వనరులు వంటి వస్తువులపై జీరో టారిఫ్ వేయాలని ఈయూ, అమెరికా నిర్ణయించాయని వాండెర్ లెయ్న్ తెలిపారు.