
సెక్రెటేరియెట్ లోని శాఖల తరలింపు మరికొంత లేటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్కే భవన్లో ఇంకా రెండు శాఖల షిఫ్టింగ్ పనులే మొదలుకాలేదు, మరికొన్నింటి పనులు సగంలోనే ఉన్నాయి. దానికితోడు శని, ఆదివారాలు సెలవులు కావడంతో అధికారులు, సిబ్బంది వచ్చే పరిస్థితి లేదు. దీంతో బీఆర్కే భవన్ ఖాళీ అయ్యేందుకే కనీసం పది రోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే సెక్రెటేరియట్ నుంచి శాఖల తరలింపు మొదలవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
మరమ్మతులు, అసెంబ్లీ సమావేశాలతోనూ..
రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున శాఖల తరలింపుపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా బీఆర్కే భవన్‌ను ఖాళీ చేశాక.. క్లీనింగ్, మరమ్మతులు, పెయింటింగ్, ఆధునీకరణ, ఏసీల ఏర్పాటు, డేటా సెంటర్, ఫైళ్లు భద్రపరిచే ర్యాక్‌లు, లాకర్ల ఏర్పాటు రక్షణ పరికరాల వంటి ఏర్పాట్ల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరికొన్ని శాఖలు షిఫ్ట్ కానున్న ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనూ మరమ్మతులు, ఇతర ఏర్పాట్లకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సీసీ టీవీలు, బందోబస్తు..
బీఆర్కే భవన్ నిఘా నీడలోకి వెళుతోంది. ఇప్పటికే భవనాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు, బారికేడ్ల ఏర్పాటు, రోడ్ల మూసివేత, బందోబస్తు ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. బీఆర్కే భవన్, ఆవరణలో వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక బీఆర్కే భవన్‌లోని 9వ ఫ్లోర్లో సీఎం ఆఫీసును ఏర్పాటు చేయాలని అధికారులు తొలుత భావించారు. అయితే చుట్టూ ఎత్తైన భవనాలు ఉన్నందున ఆ ఫ్లోర్ సురక్షితం కాదని భావించిన అధికారులు.. కింది ఫ్లోర్లలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.