
- ధాన్యం తరలించేందుకు లారీల కొరత
- రోడ్లపై వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు తరలింపు
- వడ్లను తరలించేందుకు ఒప్పిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు
- మిల్లుల్లో అన్ లోడింగ్ సమస్య ఉందంటున్న లారీ ట్రాన్స్పోర్టర్లు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో రెవెన్యూ, పోలీస్ అధికారులు రోడ్డెక్కారు. హైవేలపై వెళ్తున్న ఖాళీ లారీలను ఆపి, వాటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో కాంటా వేసి, నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను అలాట్ అయిన మిల్లులకు తరలించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ముందుగా టెండర్లలో పాల్గొని, అగ్రిమెంట్ చేసుకున్న లారీ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పొలం కోసిన రైతు తేమ శాతం తగ్గేందుకు కొన్ని రోజులు, ఆ తర్వాత సీరియల్ ప్రకారం కాంటాలు వేసేందుకు మరికొన్ని రోజులు, కాంటాలు అయిన ధాన్యం తరలించేందుకు మరికొన్ని రోజులు.. ఇలా ఒక్కో సెంటర్కు కనీసం రెండు వారాలకు పైగా సమయం పడుతోంది.
కాంటాలు వేసిన బస్తాలు కొన్ని కేంద్రాల్లో పది రోజులకు పైగా నిల్వ ఉంటున్నాయి. అదే సమయంలో వాతావరణ పరిస్థితులు రైతులను టెన్షన్ పెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో గురువారం రాత్రి నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో వర్షం కారణంగా వందలాది బస్తాల ధాన్యం తడిసింది. చేగొమ్మ కొనుగోలు కేంద్రంలోనే దాదాపు 300 బస్తాల ధాన్యం తడిసిచిపోయింది.
లారీ కాంట్రాక్టర్లు అందుబాటులో లేక..
జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు అవసరమైన లారీల టెండర్ ల కోసం ఆయా మండలాలను 8 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ కు 40 లారీలు అందుబాటులో ఉంచాలనేది టెండర్ కండిషన్లలో ఒకటి. దూరాన్ని బట్టి ఐదు శ్లాబులుగా విభజించి, టెండర్లను పిలిచారు. ఒక్కో సెక్టార్ కు ఆయా లారీ ట్రాన్స్ పోర్టర్లు పోటీ పడగా, కిలోమీటర్ల చొప్పున తక్కువ రేటుకు టెండర్ దాఖలు చేసిన వారిని ఆయా జిల్లాల్లోనే టెండర్లను ఫైనల్ చేశారు.
8 కిలోమీటర్ల లోపు ఉన్న మిల్లులకు యావరేజీగా 30 టన్నుల లోడ్ తీసుకెళ్లే లారీకి దాదాపు రూ.9 వేల వరకు కిరాయి చెల్లిస్తున్నారు. అయితే ట్రాన్స్ పోర్టు కిరాయి తీసుకుంటున్న లారీ కాంట్రాక్టర్లు, సకాలంలో కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉండకపోవడం వల్ల ధాన్యం బస్తాల తరలింపు
లేట్ అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్ లోడింగ్ ఆలస్యంతోనే..
లారీల ఆలస్యం వల్ల ఒకవైపు అన్నదాతలు ఇబ్బంది పడుతుండగా, మిల్లుల్లో అన్ లోడింగ్ ఆలస్యం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని లారీ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఒక్కో మిల్లు దగ్గర అన్ లోడ్ అయ్యేందుకు ఐదు రోజుల నుంచి వారం రోజుల వరకు టైమ్ తీసుకుంటున్నారని, దీని వల్ల సకాలంలో మళ్లీ కొనుగోలు కేంద్రాలకు రాలేకపోతున్నామంటున్నారు. ఒక్కో మిల్లు దగ్గర ఐదారు రోజులున్న తర్వాత బస్తాల్లో శాంపిల్ చూసి తేమ శాతం ఎక్కువగా ఉందని చెబుతూ, బస్తాకు కిలో తగ్గిస్తేనే అన్ లోడ్ చేసుకుంటామని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారంటున్నారు. తరుగు తీసి ట్రక్ షీట్ మార్చి ఇస్తేనే ధాన్యం తీసుకుంటున్నరని వివరిస్తున్నారు.
ఇన్ని రోజులు మిల్లుల దగ్గరే వేచి చూడడం వల్ల తమకు కిరాయి గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇలాంటి చిక్కుముడుల మధ్య చివరకు రైతులే బాధితులుగా మారుతున్నారు. దీంతో లారీల కోసం అధికారులకు పాట్లు తప్పడం లేదు. శుక్రవారం కూసుమంచి మండలంలో ఖమ్మం, సూర్యాపేట హైవేపై రెవెన్యూ, పోలీస్ అధికారులు లారీలను ఆపి, ఖాళీ లారీలను మండలంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. శనివారం పెనుబల్లి మండలం వీఎం బంజరు పోలీస్ స్టేషన్ ముందు మండల తహసీల్దార్, పోలీసుల సహాయంతో ఖాళీగా వెళ్తున్న లారీలను ఆపి ఆయా కేంద్రాల నుంచి వరంగల్ లో కేటాయించిన మిల్లులకు ధాన్యం తీసుకువెళ్లాలని రిక్వెస్ట్ చేశారు.