
- ప్రాజెక్టులను అడిగే హక్కు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేదు
- బోర్డు కౌంటర్ అఫిడవిట్‌పై సుప్రీంకోర్టులో మన అధికారుల రిజాయిండర్
- నీటి వాటాలు తేలే వరకు ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రావు
- కేంద్ర తరఫున కామన్ అఫిడవిట్ దాఖలు చేసే అధికారం బోర్డుకు లేదు
- ఏపీ విభజన చట్టం అలాంటి అధికారాలను బోర్డుకు ఇవ్వలేదు
- తమకూ అఫిడవిట్లు, డాక్యుమెంట్లు సమర్పించే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో గంపగుత్త కేటాయింపుల్లో రెండు రాష్ట్రాల వాటా తేలే వరకు కామన్ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలంను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి ఎలా తీసుకుంటారని తెలంగాణ ప్రశ్నించింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని ఇదివరకే చెప్పామని.. ఇప్పుడు మరోసారి స్పష్టం చేస్తున్నామని తెలిపింది. సాగర్, శ్రీశైలంలోని 15 కాంపొనెంట్లను అప్పగించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్అఫిడవిట్పై తెలంగాణ అధికారులు తాజాగా రిజాయిండర్‌ను సమర్పించారు. అసలు ప్రాజెక్టులను అప్పగించాలని అడిగే హక్కు కృష్ణా బోర్డుకు లేదని అధికారులు తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే బోర్డు పనిచేస్తుందని.. అయితే, ఏపీ విభజన చట్టం మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున స్పందించే అధికారాలను బోర్డుకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులను అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున బోర్డు కామన్ అఫిడవిట్‌ను సమర్పించరాదని పేర్కొన్నారు. బోర్డులను అప్పగించే విషయంపై కౌంటర్ అఫిడవిట్ సమర్పించే క్రమంలో ఒక్కసారైనా తెలంగాణ అభిప్రాయాలను బోర్డు తీసుకోలేదని, ఏపీ తరఫున ఈఈ కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాబట్టి బోర్డు వేసిన కౌంటర్అఫిడవిట్ విచారణార్హం కాదని, వెంటనే దానిని కొట్టేయాలని విజ్ఙప్తి చేశారు.
నీటి వాటాలు తేలేదాకా..
బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ 1) అవార్డు సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఉమ్మడి ఏపీలో భాగంగా ఉందని రిజాయిండర్లో తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అవసరాలను ట్రిబ్యునల్ ముందు సరిగ్గా వివరించలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రానికి గంపగుత్తగా కేటాయింపులు చేశారే తప్ప.. విడివిడిగా కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు. ప్రొసీడింగ్స్‌లో తెలంగాణ భాగం కాకపోవడంతో తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదని, రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అవసరాలను గుర్తించిన కేంద్రం కేడబ్ల్యూడీటీ 2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్)ను ఏర్పాటు చేసిందని, ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌పై గెజిట్ జారీ చేసిందని వివరించారు. దాని ప్రకారం రెండు రాష్ట్రాలకు కేటాయించిన 811 టీఎంసీల గంపగుత్త కేటాయింపుల్లో ముందుగా రెండు రాష్ట్రాల వాటాలను తేల్చాలని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల అగ్రిమెంట్ జరిగింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా కేటాయింపులు చేశారు. 2018లో ఆ కేటాయింపులను రద్దు చేసి.. 50:50 నిష్పత్తిలోనైనా కేటాయించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలూ జరగడం లేదు. నీటి వాటాలు తేల్చేంతవరకూ కేఆర్ఎంబీ పరిధిని తేల్చడం, రెండు ప్రాజెక్టులను అప్పగించడం సాధ్యం కాదు.
ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీకి ముందే దురుద్దేశపూర్వకంగా బోర్డు పరిధిని నిర్దేశించేలా నోటిఫికేషన్లను జారీ చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలి. పైగా ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక కేటాయింపులపై ఎలాంటి ఒప్పందాలూ జరగడం లేదు. అలాంటప్పుడు బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడం సాధ్యం కాదు’’ అని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయాన్ని బోర్డు కూడా అపెక్స్ కౌన్సిల్‌కే అప్పగించిందని రిజాయిండర్లో అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులను అప్పగించేది లేదని ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేశామని, మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నామని పేర్కొన్నారు.
ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నప్పుడెలా ఇస్తరు
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయని, ఇలాంటి సందర్భంలో ప్రాజెక్టులను బోర్డుకు ఎలా అప్పగిస్తారని అధికారులు ప్రశ్నించారు. ట్రిబ్యునల్‌లో వాదనలు పూర్తయి కేటాయింపులు చేయనంత వరకు బోర్డు పరిధి తేల్చడానికి లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి జీవోను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లో సైతం బోర్డు ఇదే మాదిరిగా మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేస్తే.. కోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమకు అదనపు కౌంటర్ అఫిడవిట్లు, అఫిడవిట్లు, డాక్యుమెంట్లను సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.