
- సీఎం రేవంత్ ఢిల్లీకి 42 సార్లు చక్కర్లు కొట్టినా ప్రయోజనం శూన్యం: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి మంజూరైన ఉపాధి హామీ పనిదినాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 2024–25లో 12.22 కోట్ల పనిదినాలను మంజూరు చేస్తే.. ఇప్పుడు కేవలం 6.5 కోట్లకు పరిమితం చేశారని శనివారం ఎక్స్ వేదికగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా తెలంగాణకు సాధించిందేమీ లేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు.
రైతు బీమా నిర్వీర్యం
రైతు బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని హరీశ్ రావు విమర్శించారు. ఫిబ్రవరి నెలలోనే చెల్లించాల్సిన రూ.775 కోట్ల ప్రీమియంను మూడు నెలలుగా చెల్లించలేదన్నారు. అసలు రైతు బీమా పథకం కొనసాగుతున్నదా లేదా అనుమానం కలుగుతున్నదన్నారు. ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనన్నారు. పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి, మంత్రులకు రైతు కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా? అని ఆయన నిలదీశారు. వివిధ కారణాలతో మూడు నెలల్లో వంద మందికిపైగా రైతులు చనిపోయినట్టు తెలుస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో వారికి బీమా అందకుండా పోయిందని హరీశ్ రావు పేర్కొన్నారు.