
- కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు: పహల్గాం ఉగ్రదాడిలో భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నిఘా భద్రతా వైఫల్యంతో 26 మంది అమాయకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. టెర్రరిస్టుల అణచివేతలో సైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని పదే పదే చెప్పుకునే ప్రధాని మోదీ.. మరి ఉగ్రదాడి జరిగినప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా? అని నిలదీశారు.
ఈ విషయంలో దేశ ప్రజలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని కేంద్రం అంతర్జాయ స్థాయిలో అన్ని వేదికల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఉగ్రవాద సంస్థలకు సాయం చేయకుండా ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చేలా భారత్ వ్యవహరించాలన్నారు. అలాగే..కుల గణనను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని కేంద్రాన్ని డి.రాజా కోరారు.