నల్గొండ.. ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా

నల్గొండ.. ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా
  • మదర్సాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?
  • మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌రావు వ్యాఖ్యలు

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా అని, దేశంలో ఎక్కడ ఉగ్ర దాడులు జరిగినా మూలాలు నల్గొండలోనే కనబడుతాయని మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌రావు అన్నారు. నల్గొండలోని బీజేపీ ఆఫీస్‌‌‌‌లో శనివారం నిర్వహించిన వాజ్​పేయి జయంతికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్‌‌‌‌ జోన్‌‌‌‌గా మారిందన్నారు. ఓ వైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్ష తీవ్రవాదం బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సాలు నడుస్తున్నాయని ప్రశ్నించారు.వాటిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కొన్ని మదర్సాల్లో బంగ్లాదేశీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారన్న అనుమానం కలుగుతుందని, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశీయులను బయటికి పంపమని కేంద్రం స్పష్టమైన ఆదేశాలను ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కులగణన తప్పుల తడక అని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలను అరగోస పడుతున్నారన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌‌‌‌ మావోయిస్టులను అమానుషంగా చంపి.. ఇప్పుడు వారితో చర్చలు జరపాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌‌‌‌ నాగం వర్షిత్‌‌‌‌రెడ్డి, నాయకులు చింత ముత్యాలురావు, గోలి మధుసూదన్‌‌‌‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్‌‌‌‌ పాల్గొన్నారు.