హనుమకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్

హనుమకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్
  • ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సమస్యలు లేకుండా చూడాలి
  • సివిల్​ సప్లయిస్ ​మినిస్టర్ ఉత్తమ్​కుమార్​ రెడ్డి
  • వానాకాలంలోగా భద్రకాళి చెరువు పూడికతీత పూర్తి: మంత్రి పొంగులేటి

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో వచ్చే 15 రోజులపాటు ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు, ఎమ్మెల్యేలు స్పెషల్​ ఫోకస్​పెట్టాలని సివిల్​సప్లయిస్​ మినిస్టర్ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి సూచించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ బ్యాగులు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్​ప్రాజెక్ట్స్, ధాన్యం కొనుగోళ్లు, ఇతర సివిల్ సప్లయిస్​అంశాలపై రివ్యూ చేసేందుకు మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి శనివారం హనుమకొండ జిల్లాకు వచ్చారు. ముందుగా దేవాదుల ప్రాజెక్టులో భాగంగా హసన్​పర్తి మండలం దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్​హౌజ్, ధర్మసాగర్​వద్ద లీక్ అయిన టన్నెల్​రిపేర్ పనులను పరిశీలించారు. 

అనంతరం భద్రకాళి చెరువును సందర్శించి, పూడికతీతను పరిశీలించి, పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్​లో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటిపారుదల, పౌర సరఫరా శాఖలపై మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, సీతక్క ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్​కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అధికారులు వెరిఫై చేసిన ప్రతి ఒక్కరికీ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. రెండు సీజన్లలో తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చిందని, 80 నుంచి 84శాతం జనాభాకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ప్రభుత్వం తమదన్నారు. దేవాదుల ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తి చేయడంతోపాటు ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. 

వానాకాలంలోగా భద్రకాళి పూడికతీత..

వరంగల్ భద్రకాళి చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు వానాకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా అధికారులు డెడికేటెడ్ గా పని చేస్తున్నారని అభినందించారు.

 భద్రకాళి చెరువు హనుమకొండ, వరంగల్ జంటనగరాల ట్యాంక్​అని, బ్యాలెన్స్ వర్క్ ను షార్ట్ టెండర్లను పిలిచి పూర్తి చేయాలన్నారు. భద్రకాళి చెరువు డీసిల్టేషన్ కు 35 నుంచి 36 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఉమ్మడి వరంగల్ కు రోల్​మోడల్​గా తీర్చిదిద్దాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

సమస్యలు విన్నవించిన నేతలు..

గోదావరి నది తమ జిల్లాలోనే ఉన్నా ములుగు జిల్లాకు మాత్రం ఆ నీళ్లు దక్కడం లేదని మంత్రి సీతక్క మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. గోదావరి కరకట్ట పనులతోపాటు రామప్ప, లక్నవరం పనులు పూర్తి చేయాలన్నారు. ములుగు జిల్లాలో గిరిజన గ్రామాల పరిధిలో ఉన్న వాగులపై చెక్ డ్యామ్ లను నిర్మించాలన్నారు. సాగునీటి కాల్వల పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల్లోని సాగునీటి కాల్వలు,  చెరువులు, వాగులు, సాగునీటికి ఇబ్బందులు, ఇతర సమస్యలను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మురళీ నాయక్ మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. 

ఎమ్మెల్యేలు సూచించిన విధంగా సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని మంత్రులు హామీ ఇచ్చారు. సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సివిల్​సప్లయిస్​ కమిషనర్​డీఎస్​చౌహాన్, ఈఎన్సీ అనిల్ కుమార్, సీఈ అశోక్ కుమార్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద, అద్వైత్ కుమార్ సింగ్, దివాకర, షేక్ రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.