
హైదరాబాద్ లో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మందు, దమ్ము సేవిస్తూ వీధుల్లో గుంపులు గుంపులుగా కాలక్షేపం చేస్తూ నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసులు హెచ్చరించినా.. కొందరిని అరెస్టు చేసినా.. ఏదో ఒక కాలనీలో ఆకతాయిల వేధింపులకు గురవుతన్నారు మహిళలు, అమ్మాయిలు.
శుక్రవారం రాత్రి మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున.. అదీ భర్త ఉండగా వివాహితను కామాంధులు వేధించిన తీరు షాకింగ్ కు గురిచేసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బేగంపేట క్లబ్ 8 పబ్ నుంచి బయటికి వస్తున్న వివాహిత(29)ను పోకిరీలు వేధించారు. ‘‘నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు’’ అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు బెదిరించారు.
భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి బేగంపేటలోని క్లబ్8 పబ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా రాత్రి11:30కు ఈ ఘటన జరిగింది. పబ్ నుంచి బయటకు వచ్చిన వివాహితను వేధిస్తుండటంతో తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంబడించారు. ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై దాడికి దిగారు ముగ్గురు యువకులు. యువకుల నుంచి తప్పించుకుని డయల్ 100కి బాధితులు ఫోన్ చేశారు.
బాధితుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు ఆకతాయిల అరెస్టు చేశారు. పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లుగా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.