ఖేర్సన్ సిటీ జలమయం.. డ్యామ్ నుంచి తగ్గని వరద

ఖేర్సన్ సిటీ జలమయం.. డ్యామ్ నుంచి తగ్గని వరద
  •     ప్రమాదంలో 42 వేల మంది  తాగునీటి కోసం తప్పని ఇబ్బందులు
  •     ఉధృతంగా ప్రవహిస్తున్న దినిప్రో నది.. తీరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద

ఖేర్సన్(ఉక్రెయిన్) : ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని దినిప్రో నదిపై నిర్మించిన కఖోవ్కా డ్యామ్ పేల్చేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. డ్యామ్​లోని నీరంతా బయటికి వస్తుండటంతో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతున్నది. ఖేర్సన్ సిటీ మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో అక్కడివాళ్లను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డ్యామ్ ఎలా కూలిందన్న దానిపై అటు ఉక్రెయిన్, ఇటు రష్యా అధికారులు ఇంకా స్పష్టతకు రాలేదు. ఒకటి రెండు రోజుల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గిపోతుందని అధికారులు భావించారు. గంటగంటకూ వరద పెరుగుతోందని, గురువారానికి ఒక మీటర్ (మూడు అడుగులు)కు పెరగొచ్చని ప్రకటించారు. దినిప్రో నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

పేల్చివేతపై అదే అయోమయం

రష్యానే ఉద్దేశపూర్వకంగా ఈ డ్యామ్ ను పేల్చేసిందని బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. దీంతో సుమారు 42వేల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. ‘‘వందలాది మంది ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల పైకప్పులపై పడుకున్నారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండ్లు విడిచి వెళ్లిపోయారు’’ అని జెలెన్​స్కీ వివరించారు. వరద తీవ్రత చాలా మెల్లిగా తగ్గుతున్నదని ఖేర్సన్ రీజినల్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఒలెక్సాండర్ ప్రోకుడిన్​ తెలిపారు. దినిప్రో నది తీరంలో 1,800కు పైగా ఇండ్లు ముంపునకు గురయ్యాయని చెప్పారు.

వరద ప్రవాహానికి కూలుతున్న వంతెనలు

వరద ప్రవాహం కారణంగా మైఖోలోవ్‌‌‌‌ లోని బ్రిడ్జిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యెల్జావెటికోవ్‌‌‌‌, హల్‌‌‌‌హన్విక గ్రామాల్లోని వంతెనలు కొట్టుకుపోయాయి. డ్యామ్ పేల్చేసిన తర్వాత ఏడుగురు గల్లంత య్యారని రష్యా ఆధీనంలో ఉన్న నోవా కఖోవ్కా మేయర్ వ్లాదిమిర్ లియోన్టీవ్ ప్రకటించారు. నోవా కఖోవ్కాకు చెందిన 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వరదలో చిక్కుకుపోయిన 17 మందిని రెస్క్యూ చేశామని తెలిపారు.