లబ్ధిదారుల ఎంపిక సరే.. ‘దళితబంధు ’ డబ్బులేవీ ?

లబ్ధిదారుల ఎంపిక సరే..  ‘దళితబంధు ’ డబ్బులేవీ  ?
  • చారగొండ మండలం పేరుకే పైలెట్ ప్రాజెక్ట్‌‌
  • స్టార్టింగ్‌‌ స్టేజీ దాటని దళితబంధు స్కీమ్‌‌
  • అకౌంట్లలో రూ.1.40 లక్షలు వేసి చేతులు దులుపుకున్న ఆఫీసర్లు
  • 1396 మంది లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు 

నాగర్​కర్నూల్, ​వెలుగు:  దళితుల జీవితాలు బాగు చేస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు స్కీమ్‌‌ ముందుకు సాగడం లేదు. పైలెట్‌‌ ప్రాజెక్ట్​ గా ఎంపికైన నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ జిల్లా చారగొండ మండలంలో స్టార్టింగ్‌‌ స్టేజీ దాటడం లేదు.  పలుమార్లు మీటింగులు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినా ఆఫీసర్లు డబ్బులను మాత్రం ఇవ్వడం లేదు.  ఇప్పటి వరకు ఒక్క యూనిట్‌‌ కూడా పూర్తిస్థాయిలో గ్రౌండ్ కాలేదు.  కేవలం కొందరి అకౌంట్లలో రూ.1.40 లక్షలు వేసి చేతులు దులుపుకోవడంతో  పరిస్థితి మొదటికొచ్చింది. తాము ఎంపిక చేసిన యూనిట్‌‌కు అకౌంట్లలో పడిన డబ్బులకు పొంతన లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ఆఫీసర్లను అడిగితే ముందు డబ్బులు పెట్టుకుంటే తర్వాత ఇస్తామని చెబుతున్నారని, తమ వద్ద డబ్బులు ఉంటే స్కీమ్‌‌ కింద ఎందుకు అప్లై చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. 

1396 మంది లబ్ధిదారులు

దళితబంధు కింద రూ.10 లక్షలు లోన్‌‌ ఇస్తామని ప్రకటించిన సర్కారు పైలెట్ ప్రాజెక్టు కింద చారగొండ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులోభాగంగానే మొదటి విడత కింద రూ.50 కోట్లు రిలీజ్‌‌ చేసింది.  ఎస్సీ కార్పొరేషన్‌‌ ఆఫీసర్లు  బ్యాంక్​ అకౌంట్లు, యూనిట్లపై అవగాహన కల్పించి అప్లై చేసుకోవాలని కోరారు.  దీంతో ట్రాన్స్​పోర్ట్​ సెక్టార్​లో 639 మంది, సర్వీస్​ సెక్టార్‌‌‌‌లో 181మంది, రిటైల్, బిజినెస్​ సెక్టార్‌‌‌‌లో  207 మంది, అగ్రి, పౌల్ట్రీ, డెయిరీ సెక్టార్‌‌‌‌లో 369 అప్లికేషన్స్ పెట్టుకున్నారు.  మొత్తం 1396 అప్లికేషన్స్​లో దాదాపు 639 మంది  ఆటోలు, ట్రాలీ ఆటోలు,  ట్రాక్టర్లు, కార్లు, హార్వెస్టర్లు, జేసీబీలు, అంబులెన్సులు, ట్రక్కుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. అగ్రి సెక్టార్‌‌‌‌లో పశువుల, కోళ్ల దాణా కేంద్రాలు, గొర్రెలు, ఆవులు, డెయిరీ యూనిట్లు, పవర్​ టిల్లర్లు, కూరగాయల షెడ్లు  ఉన్నాయి.  రిటైల్​,బిజినెస్​ సెక్టార్​లో  సిమెంట్​, కిరాణం, మెడికల్,  లేడీస్ కార్నర్​ తదితర షాప్స్​ఉన్నాయి.  యూనిట్​కాస్ట్​రూ.10లక్షలు దాటితే బెనిఫిషరీ భరించాల్సి ఉంటుంది.  ఇప్పటి వరకు సర్వీస్​, ట్రాన్స్​పోర్ట్, అగ్రిసెక్టార్ల కింద ఎంపికైన వారి అకౌంట్లలో కేవలం రూ.1.40 లక్షలు జమ చేశారు.

నిలదీసిన ప్రజాప్రతినిధులు

వారం క్రితం స్టాండింగ్ కమిటీ మీటింగ్‌‌లో  జడ్పీ చైర్‌‌‌‌ పర్సన్‌‌ పద్మావతి, స్థాయి సంఘం చైర్‌‌‌‌ పర్సన్‌‌ ఊర్కొండ జడ్పీటీసీ శాంతాకుమారితో పాటు ఇతర జడ్పీటీసీలు దళితబంధుపై ఎస్సీ కార్పొరేషన్‌‌ ఈడి రామ్‌‌లాల్‌‌ను నిలదీశారు. పైలెట్​  ప్రాజెక్ట్​ కింద ఎంపికైన చారగొండలో స్కీమ్​ అప్‌‌డేట్‌‌ చెప్పాలని ప్రశ్నించారు.  తమకు కనీస సమాచారం  లేకపోతే  లబ్ధిదారులకు ఏం చెప్పాలని అడగగా.. ఆయన  సీఎం కేసీఆర్‌‌‌‌ వచ్చిన తర్వాత యూనిట్లు గ్రౌండింగ్ చేస్తామని సమాధానం  ఇచ్చారు. కాగా,  ఈ విషయంపై  ఎస్సీ డెవలప్‌‌మెంట్‌‌ శాఖ ఆఫీసర్‌‌‌‌ను వివరణ కోరగా.. వచ్చిన రూ. 50 కోట్లను అందరి అకౌంట్లో  జమ  చేశామని, మిగతావి విడతవారీగా జమ చేస్తామని చెప్పారు. 

లోన్‌‌ ముట్టలేదు

దళిత బంధు కింద  డెయిరీకి దరఖాస్తు పెట్టుకున్న.  ఆఫీసర్లు షెడ్ వేసుకొమ్మని చెప్తే రూ. 1.50 లక్షలు పెట్టి వేసిన.  కానీ, అకౌంట్‌‌లో రూ.1.40 లక్షలు మాత్రమే జమైనయి. ఆవులు, బర్రెలు ఎప్పుడిస్తరని అడిగితే ముందు తెచ్చుకుంటే తర్వాత పైసలిస్తమంటున్నరు. మాతాన పైసలేడున్నయి. మండలంలో ఎవరికీ ఇంకా లోన్ ముట్టలేదు.  

- అంకిల్ల చిన్న యాదయ్య, జూపల్లి మండలం, చారగొండ