
- రూ.5, రూ.10 ప్యాక్స్ ఎవర్గ్రీన్ కంపెనీలకు వెన్నెముక
- ఈ ప్యాక్స్‌తో భారీగా అమ్మకాలు
న్యూఢిల్లీ: కిరాణా షాపులో అడుగుపెట్టిన వెంటనే మెజారిటీ కస్టమర్లు మొదట చూసేది రూ.5, రూ.10 ప్యాక్‌ల వైపే! ఎందుకంటే వీటి ధర తక్కువ. కొనడం ఈజీ. తీసుకెళ్లడం సులువు. చిల్లర సమస్య ఉండదు. కంపెనీలకు ఈ సంగతి చాలా బాగా తెలుసు కాబట్టే వీటిని అవి సైకలాజికల్ యాంకర్స్ అని పిలుస్తాయి. కొనుగోలుదారుణ్ని తమ రెగ్యులర్ కస్టమర్‌గా మార్చుకోవడానికి బడ్జెట్ప్యాక్లు కీలకం. అందుకే మనదేశ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రూ. 5, రూ. 10 ధరలను చాలాకాలంగా మార్చడం లేదు.
ఇక నుంచీ మార్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ ప్యాక్స్ అన్ని వర్గాల కస్టమర్లను చేరుకోవడానికి సాయపడతాయి. సామాన్య వినియోగదారులకు అందుబాటు ధరను అందించి, భారీ అమ్మకాలను సాధిస్తాయి. ఈ ధరలను నిలబెట్టుకోవడానికి కంపెనీలు ధరను పెంచకుండా, సైజును తగ్గిస్తాయి. దీనిని గ్రామేజీ తగ్గింపు అంటారు.
జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, కంపెనీలు ధరలను మార్చడానికి ఇష్టపడటం లేదు. ధర మార్పు వల్ల ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్, లాజిస్టిక్స్‌లో సమస్యలు వస్తాయి. అందుకే, ధరను తగ్గించకుండా, అదే ధరకు ఎక్కువ ఉత్పత్తిని అందిస్తూ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి.
ఏ కోణంలో చూసినా..
అన్ని ప్రాంతాల్లోనూ రూ. 5, రూ. 10 ధరలు చాలా ముఖ్యమైనవి. ఈ ధరలు వినియోగదారులకు సులభంగా అర్థమవుతాయి. నగదు లావాదేవీలకు అనుకూలంగా ఉంటాయి. సబ్బు, నూడుల్స్, చాక్లెట్, పెరుగు వంటి ఏ ఉత్పత్తి అయినా రూ. 10 ప్యాక్ వెంటనే అమ్ముడుపోతుంది. ఇదే ఉత్పత్తికి రూ. 15 ధర పెడితే అమ్ముడుపోదు. ఐదు రూపాయల తేడాతోనూ సమస్యలు వస్తాయి. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో బ్రాండ్‌కు క్వాలిటీ, సైజు కంటే ధరకు ఎక్కువ లాయల్టీ ఉంటుంది.
ఒక బ్రాండ్ ధర పెంచితే, వినియోగదారులు వెంటనే తక్కువ ధరలో ఉన్న మరో బ్రాండ్‌కు మారతాడు. అందుకే కంపెనీలు తమ మార్కెట్‌ను కాపాడుకోవడానికి ఈ ధరలను మార్చవు. కొన్నేళ్ల కిందట రూపాయి, రూ. 2 ప్యాక్స్ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు రూ. 5, రూ. 10 అయ్యాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడమే ఇందుకు కారణం. భవిష్యత్తులో రూ. 10 కనీస ధరగా మారే అవకాశం ఉంది. ఈ ధరలు మార్కెట్‌లో కంపెనీల మనుగడ, విజయం కోసం అత్యవసరమైనవని ఎఫ్‌ఎంసీజీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.