పనిచేసినా.. గౌరవం లేదు

పనిచేసినా.. గౌరవం లేదు
  • 7న రాజీనామా చేస్తానని ప్రకటన
  • పనిచేసినా.. గౌరవం లేదని కామెంట్​
  • అనుచరులతో ఇయ్యాల మీటింగ్​

వరంగల్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు  సోదరుడు.. టీఆర్ఎస్‍ సీనియర్​ లీడర్​ ఎర్రబెల్లి ప్రదీప్‍రావు పార్టీకి గుడ్‍ బై చెబుతున్నారు. 7న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్‍లో ఎంత సిన్సియర్‍గా పనిచేసినా.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినా.. గుర్తింపు లేదన్నారు. రెండు సార్లు అన్యాయం జరిగినా హైకమాండ్‍ చెప్పినట్లు విన్నానన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని  చెప్పిన పెద్దలు, ఇవ్వకపోగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కేడర్​కు కూడా అన్యాయం జరుగుతోందన్నారు. 80 శాతం మంది కార్యకర్తలు టీఆర్ఎస్‍ని వీడాలని కోరుకుంటున్నారని చెప్పారు. 

అన్న వేరు.. అభిప్రాయాలు వేరు

టీఆర్ఎస్‍ పార్టీకి రాజీనామా చేసే విషయంలో అన్న ఎర్రబెల్లి దయాకర్​ రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్న వేరు.. అభిప్రాయాలు వేరని చెప్పారు. రాజీనామా అనంతరం త్వరగా ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమన్నారు. బుధవారం వరంగల్ లోని తన నివాసంలో అనుచురులతో సమావేశం అవుతున్నట్టు తెలిపారు. ఇందులో టీఆర్ఎస్‍ లీడర్లు ఎవరూ ఉండరని చెప్పారు. ఎప్పటి నుంచో తనవెంట నడిచిన వారే హాజరవుతారని తెలిపారు.

బీజేపీ వైపు ప్రదీప్​ రావు!

ప్రదీప్‍రావు బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‍రెడ్డితో కలిసి చేరుతారని సమాచారం. బీజేపీ ముఖ్య నేతలు తనను అప్రోచ్​ అయిన మాట వాస్తవమేనని ఎర్రబెల్లి ప్రదీప్​ చెప్పారు. టీఆర్ఎస్‍లో ఉంటూ మరో పార్టీ గురించి మాట్లాడటం.. ఫలానా పార్టీలో చేరుతానని ప్రకటన చేయడం సబబు కాదన్నారు.