ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • బెల్లంపల్లిలో వెలవెలబోయిన ప్రజావాణి 
  • గంటన్నరపాటు ఎదురుచూసిన కలెక్టర్​ 
  • ఇకమీదట తహసీల్​ ఆఫీసులో నిర్వహించాలని ఆర్డర్​  

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఎంపీడీవో ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ భారతి హోళికేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మధ్యాహ్నం 12  గంటలకు ఎంపీడీవో ఆఫీస్​కు చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు ఎదరుచూసినా ప్రజలు ఎవరూ రాలేదు. దీంతో కలెక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలు ఎందుకు ప్రజావాణికి హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని ఎంపీడీవో రాజేందర్​ను, స్పెషల్​ ఆఫీసర్​ దుర్గాప్రసాద్​తో పాటు ఇతర అధికారులను ఆరా తీశారు. ఇక్కడ ప్రజావాణికి స్పందన లేదని గ్రహించిన కలెక్టర్ వచ్చే సోమవారం నుంచి బెల్లంపల్లి తహసీల్దార్ ఆఫీసులో నిర్వహించాలని ఆదేశించారు. మండలంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఉపాధిహామీ పనులు గ్రామాల్లో పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం, 
ఉపాధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈజీఎస్​ ఏపీవో జీనత్​ను ఆదేశించారు. హరితహారం పనులపై అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.

ఆదిలాబాద్ లో బీజేపీ లీడర్ల అరెస్ట్​

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  హిందూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్​బంద్​నిర్వహించారు. జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల లీడర్లు  బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణ సముదాయాలు మూసి వేయించారు. స్థానిక అశోక్ రోడ్ లో దుకాణాలు మూసివేయిస్తున్న టైమ్​లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లీడర్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ గోషమహాల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చిరించారు. ఇచ్చోడలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. 

క్రమబద్ధీకరణ దరఖాస్తులపై దృష్టిపెట్టాలి

ఆదిలాబాద్,వెలుగు: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 59 కింద వచ్చిన దరఖాస్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక టీమ్​లు ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ఆదిలాబాద్ అర్బన్ 542, ఆదిలాబాద్ రూరల్ లో నాలుగు, మావల159, తాంసి16, నేరడిగొండలో రెండు, ఉట్నూర్ ఒకటి చొప్పున మొత్తం 724 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్ ఉన్నారు. 

మట్టి గణేశ్​ విగ్రహాలే మేలు 

నిర్మల్,వెలుగు: పర్యావరణ హితం కోరే మట్టి గణేశ్​ విగ్రహాలే మేలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. అల్లోల దివ్యారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్లిమామ్ స్వచ్ఛంద  సంస్థ తయారు చేసిన గోమయ మట్టి  గణపతులను సోమవారం మంత్రి పంపిణీ చేశారు. మొదట మంత్రితో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు గౌతమ్ రెడ్డి, కోడలు దివ్యారెడ్డిలు గోమయ మట్టి దంపతులకు పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను గ్రామాలవారీగా అందించారు. మట్టి  విగ్రహాలతో ఎలాంటి హాని ఉండదని, కాలుష్యం లేని పర్యావరణ హితం, ఎకో ఫ్రెండ్లీ వాతావరణం  ఏర్పడుతుందన్నారు. రసాయనాలతో తయారుచేసే గణపతి విగ్రహాల నిమజ్జనంతో చెరువులు, ప్రాజెక్టుల నీరు కలుషితమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్​ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మార్గొండ రాము తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ హబ్ గా నిర్మల్...

నిర్మల్ జిల్లా కేంద్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాకీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ పాకాల రామచందర్  క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడాకారులను మంత్రి  సత్కరించారు. ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, అయ్యన్న గారి భూమయ్య, పెటా జిల్లా ప్రధాన కార్యదర్శి భోజన్న తదితరులు పాల్గొన్నారు.

ఖానాపూర్​లో..

ఖానాపూర్ ,వెలుగు: ఖానాపూర్​పట్టణంలోని  వాసవీమాత ఆలయంలో వాసవి, వనిత క్లబ్ సంయుక్త అధ్వర్యంలో పట్టణంలోని వినాయక మండపాలకు 50 మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో  క్లబ్ జోనల్ చైర్మన్ జితేందర్​గుప్తా, క్లబ్ అధ్యక్షుడు ముక్క కిషన్, గోలి పద్మజ, సభ్యులు లక్ష్మీనారాయణ, మాధవి, మనిచరన్, సతీశ్​ కుమార్ తదితరులు 
పాల్గొన్నారు .

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి

మంచిర్యాల,వెలుగు:  వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ నాయక్​కు పలు డిమాండ్లతో  మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా సమితి జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... ఆసరా పెన్షన్లు ప్రతినెల మొదటి వారంలో ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఐదు శాతం కేటాయించాలని, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. అలాగే బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, వికలాంగుల బంధు పథకం అమలు చేయాలని, మూడెకరాల భూమి ఇవ్వాలని కోరారు. వికలాంగుల శాఖను స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయాలని, అన్ని ఆఫీసుల్లో ర్యాంపులు నిర్మించాలని అన్నారు. 2016 దివ్యాంగుల చట్టాన్ని అమలు చేయాలని, అందరికీ ట్రైసైకిళ్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరు సమ్మయ్య, ఎమ్మెఎఫ్​ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి క్రీడాకారులకు సన్మానం

రామకృష్ణాపూర్​,వెలుగు: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్​సింగరేణి ఆర్​కేపీ సీఈవో క్లబ్​లో సోమవారం రాత్రి క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా జీఎస్సాఆర్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సింగరేణి, జనరల్ విభాగాల క్రీడాకారులను ఘనంగా సన్మానించి బహుమతులు అందించారు. అంతకుముందు ధ్యాన్​చంద్ ఫొటోకు నివాళి అర్పించారు. మంచిర్యాల స్పోర్ట్స్ లెజెండ్స్, మాస్టర్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరరావు, శఠగోపం కిష్టయ్య, వీరస్వామి, ఎం.లక్ష్మయ్య, రాధాకృష్ణ, వెంకటయ్య, రాజాకొమురయ్య తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో సీఎస్సాఆర్​ ఫౌండేషన్​వ్యవస్థాపకుడు డాక్టర్ రాజారమేశ్, మెంబర్లు బద్రి సతీశ్, ప్రకాశ్, వెంకన్న, కిరణ్, కిశోర్, రవి, డాక్టర్ తిరుపతి, ప్రభు, శివ, సిద్దు జగదీశ్​, అమర్​ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర మంత్రిని కలిసిన కేఎస్ఆర్ 

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఇటీవల బీజేపీలో చేరిన పారిశ్రామిక వేత్త, సామాజిక కార్యకర్త ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి సోమవారం హైదరాబాద్​లో  కేంద్ర మంత్రి బీఎల్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిస్థితులపై మంత్రితో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

పేదరిక నిర్మూలన కోసం కృషిచేయాలి

ఇచ్చోడ,వెలుగు: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని మెప్మా పీడీ బి.లత చెప్పారు. సోమవారం ఇచ్చోడ ఐకేపీ కార్యాలయంలో కార్యనిర్వాహక సభ్యులు, వీవోఏలకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో డీఎం గంగాధర్,  ఏపీఎం దయాకర్,  సీసీలు 
మాధవ్, మల్లయ్య, భాస్కర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అధికారంలోకి  రావడం ఖాయం

ఖానాపూర్,వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని  ఆపార్టీ అసెంబ్లీ లీడర్​అజ్మీర హరినాయక్ చెప్పారు. సోమవారం మండలంలోని గోసంపల్లె, పాత ఎల్లాపూర్​లో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించారు. ప్రజాసంక్షేమ లక్ష్యంగా మోడీ సర్కార్ పనిచేస్తోందన్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన పలువురు యువకులు బీజేపీ లో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, మండల అధ్యక్షుడు టేకు ప్రకాశ్, లీడర్లు వెంకట రమణ, శ్రావణ్, ఎనగందుల రవి, సదాశివ, స్వామి, సుధాకర్, రమేశ్,శంకర్, సురేశ్​తదితరులు ఉన్నారు.