2.62 లక్షల యూనిట్ల మార్క్‌‌ దాటిన ప్రాపర్టీల అమ్మకాలు

 2.62 లక్షల యూనిట్ల మార్క్‌‌ దాటిన ప్రాపర్టీల అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశంలో వడ్డీ రేట్లు పెరుగుతున్నా  రియల్‌‌ ఎస్టేట్‌‌ మార్కెట్‌‌లో  డిమాండ్, ప్రాపర్టీల ధరలు  తగ్గవని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నాయి.  టాప్ ఏడు సిటీలలో ఈ ఏడాది ప్రాపర్టీల అమ్మకాలు కరోనా ముందు స్థాయి అయిన 2.62 లక్షల యూనిట్ల మార్క్‌‌ను దాటేస్తాయని పేర్కొన్నాయి. గత ఆరేళ్లలో  వరసగా డీమానిటైజేషన్‌‌,  రెరా, జీఎస్‌‌టీ, కరోనా వలన ఇబ్బంది పడ్డ రియల్ ఎస్టేట్‌‌ సెక్టార్‌‌లో  వ్యవస్థీకృతంగా చాలా  మార్పులు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  రియల్టీ మార్కెట్ ప్రస్తుతం దీర్ఘకాలం పాటు పెరిగే దశలో స్టార్టింగ్‌‌లో ఉందని వివరించాయి. రెరా వలన మార్కెట్‌‌లో బయ్యింగ్‌‌ సెంటిమెంట్ బలపడిందని హోమ్‌‌ బయ్యర్లను రిప్రెజెంట్ చేసే ఎఫ్‌‌పీసీఈ పేర్కొంది. కాగా, మార్కెట్‌‌లో లిస్ట్ అయిన మేజర్ డెవలపర్లు  కిందటి ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ లెవెల్‌‌లో సేల్స్‌‌ను ప్రకటించాయి.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు మరింత బాగుంటాయనే సంకేతాలను ఇచ్చాయి. మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆర్‌‌‌‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుండడం, బ్యాంకులు ఇచ్చే అప్పులు ఖరీదుగా మారడంతో సేల్స్‌‌ కొంత తగ్గుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇండ్ల ధరలు పెరగడం కూడా మార్కెట్‌‌లో బయ్యర్ల సెంటిమెంట్‌‌ను దెబ్బతీస్తుందని అన్నారు. కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రేట్లు ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడం, ఇన్‌‌పుట్ కాస్ట్ ఎక్కువవ్వడమే ఇందుకు కారణం. కానీ, రానున్న ఫెస్టివ్ సీజన్‌‌ తర్వాత షార్ట్‌‌ టెర్మ్‌‌లోనైనా  డిమాండ్ పుంజుకుంటుందని డెవలపర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆశలు పెట్టుకున్నారు.