పార్టీ మారినా ఫలితం దక్కలే!

పార్టీ మారినా ఫలితం దక్కలే!
  •  ఖమ్మం పార్లమెంట్ టికెట్​ ఆశించి భంగపడ్డ జలగం
  • బీజేపీ టికెట్​ దక్కకపోవడంతో ఆయనతో పాటు అనుచరుల్లో అయోమయం
  • పార్లమెంట్​ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్​పై నిర్ణయం

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జలగం వెంకట్రావు టికెట్‌ కోసం పార్టీ మారినా ఫలితం దక్కలేదు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశించిన జలగం పార్టీ హైకమాండ్​ హామీ ఇవ్వడంతో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు చేరిన మరో బీఆర్ఎస్​ నేత, హుజూర్‌‌నగర్‌‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నల్గొండ టికెట్ కన్ఫామ్ ​చేసిన బీజేపీ హైకమాండ్.. ​ జలగం పేరును మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది.  ముందు బీఆర్ఎస్​ నుంచి మరో బలమైన నేత చేరతారని ఎదురుచూసిన పార్టీ.. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించడంతో ఆలస్యం చేసింది.

 అయితే ఆ లీడర్​ఆసక్తి చూపించకపోవడంతో జలగంకే ఛాన్స్​ ఇస్తారని అంతా భావించారు. కానీ, బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా తాండ్ర వినోద్ రావు పేరును అనౌన్స్​ చేసి జలగం వెంకట్రావుకు షాక్​ఇచ్చింది.  టికెట్​కోసం జలగం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్​ఆఫీస్​చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ తీరుతో ఖంగుతిన్న జలగం ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆయన మద్దతుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్‌ నిర్ణయం ఉంటుందని తెలిసింది. 

సీఎం రాజకీయ వారసుడిగా ఎంట్రీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జలగం వెంగళరావు వారసుడిగా వెంకట్రావు పొలిటికల్​ఎంట్రీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీచేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్​కావడంతో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం నుంచి టీఆర్ఎస్​ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆయనే. 2018లో కాంగ్రెస్​ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. 

వనమా అఫిడవిట్ లో తప్పులున్నాయని, ఆయనపై అనర్హత వేటు వేయాలని న్యాయపోరాటం చేశారు. గత ఏడాది జలగంకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. దీంతో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రాగా బీఆర్ఎస్​ టికెట్​ తిరిగి వనమాకే దక్కడంతో జలగం రెబల్​ఫార్వర్డ్​బ్లాక్​క్యాండిడేట్​గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీలో చేరారు.

 కొత్త అభ్యర్థి వైపు మొగ్గు

 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జలగం వెంకట్రావును పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. జిల్లాలో బీజేపీకి పట్టు లేకపోవడంతో ఆయన అప్పట్లో ఇంట్రస్ట్ చూపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీకి ఉమ్మడి జిల్లాలో కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లోనూ 20వేల ఓట్లే పడ్డాయి. కొత్తగూడెంలో స్వతంత్రంగా పోటీ చేసి 50 వేల ఓట్లు సాధించిన వెంకట్రావును ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ హైకమాండ్ భావించింది. 

ఆయనకు సత్తుపల్లి, ఖమ్మం తదితర నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణం ఉండడం పార్టీకి కలిసివస్తుందని అంచనా వేసి లోక్​సభ టికెట్​ఇస్తామని ఆఫర్​ ఇచ్చింది. జలగంతో పాటు బీఆర్ఎస్​ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు కోసం కూడా ప్రయత్నాలు చేసింది. నామ రాకపోవడంతో జలగంకు లైన్​ క్లియర్ అయినట్టే భావించారు. కానీ చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ అనుభవంలేని వ్యక్తిని బీజేపీ తెరపైకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయ వారసత్వం, అనుభవం ఉన్న తనను కాదని.. కొత్త అభ్యర్థిని తేవడం పట్ల జలగం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.