- గోల్డ్ ధరలు పెరుగుతున్నా..ఆభరణాలతో అనుకున్నంత లాభం లేదు.. తక్కువ ఆదాయ కుటుంబాల దగ్గరనే ఎక్కువగా నగల బంగారం
- మేకింగ్ ఛార్జీలు పెరగడం, ఇతర రత్నాల ధరలు తగ్గడంతో పడిపోతున్న రాబడి
- ప్యూర్ గోల్డ్‌పై ఏడాదికి సగటున 12.5 శాతం రిటర్న్ వస్తే..ఆభరణాలపై వస్తోంది 10.3 శాతమే
- కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్ వెల్లడి
- ఇండియాలో కుటుంబాల దగ్గర 34,600 టన్నుల గోల్డ్ ఉందని అంచనా
న్యూఢిల్లీ: బంగారం ధరలు దూసుకుపోతున్నా, అంతేస్థాయిలో బంగారు ఆభరణాలపై రాబడి లేదు. భారతీయ కుటుంబాలు ఎక్కువగా గోల్డ్‌ని గాజులు, హారాలు, పెళ్లి ఆభరణాల రూపంలో కలిగి ఉంటున్నాయి. కానీ ఇవి వారికి అనుకున్నంత లాభాన్ని ఇవ్వడం లేదని బ్రోకరేజ్ కంపెనీ కోటక్ ఇనిస్టిట్యూట్ ఈక్విటీస్ ఓరిపోర్ట్‌లో పేర్కొంది.
బంగారం ధరలు పెరిగినా, ఆభరణాలపై పెట్టుబడుల రాబడి తక్కువగా ఉందని తెలిపింది. 2010–11 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే, గోల్డ్ రేట్లు ఏడాదికి సగటున 12.5 శాతం పెరిగాయి. కానీ, ఇదే టైమ్‌లో బంగారు ఆభరణాలపై వచ్చిన రాబడి ఏడాదికి 10.3 శాతం దగ్గరనే ఉంది. మేకింగ్ ఛార్జీలు పెరగడం, నాన్-గోల్డ్ భాగాలు, డైమండ్ ధరల పడిపోవడం వంటి కారణాలతో బంగారు ఆభరణాలపై వచ్చే రేటు, ప్యూర్ గోల్డ్ రేటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటోంది.
విలువ తగ్గడానికి కారణం..
కోటక్ రిపోర్ట్ ప్రకారం, ఆభరణాల ధరలో 60–70శాతం మాత్రమే నిజమైన బంగారం విలువ. మిగతా భాగంలో మేకింగ్ ఛార్జీలు, రత్నాల రేటు ఉంటోంది. డైమండ్ వంటి ఇతర రత్నాల ధరలు పడిపోవడంతో ఆభరణాలపై వచ్చే లాభం తగ్గుతోంది. సాధారణ రిటైల్ షాపుల్లో గోల్డ్ జ్యువెలరీ కొంటే, గోల్డ్ ధర అప్పటి స్థాయి నుంచి మరో 25–30శాతం పెరిగితే తప్ప పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు.
తక్కువ ఆదాయ కుటుంబాలపై ప్రభావం
ఏడాదికి రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు దేశ బంగారం నిల్వల్లో 70శాతం వాటా కలిగి ఉన్నాయి. అంటే బలహీనమైన ఆర్థిక వర్గాలు ఆభరణాల రూపంలో ఎక్కువ చెల్లిస్తున్నారు. జ్యువెలరీని ఎక్కువ కాలం దాచి పెట్టుకున్నా, అనుకున్నంత లాభం పొందలేకపోతున్నారు. చాలా కుటుంబాలు బంగారు నగలను పెళ్లిలు, చదువులు వంటి పెద్ద ఖర్చుల కోసం కొని, దాస్తున్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇన్సూరెన్స్‌గా పనిచేస్తుందని భావిస్తున్నాయి.
కానీ, పెట్టుబడి పరంగా ఆభరణాలను కొనడం అంత తెలివైన పనికాదని కోటక్ అభిప్రాయపడుతోంది. మరోవైపు గోల్డ్ దిగుమతులు పెరగడంతో దేశ కరెంట్ అకౌంట్, వాణిజ్య లోటు ఎక్కువవుతోంది. బంగారం, రత్నాల దిగుమతులు విదేశీ పెట్టుబడులను మించిపోతున్నాయి. ఈ ఏడాది బంగారం రేట్లు 62 శాతం పెరగడంతో కుటుంబాల దగ్గర ఉన్న బంగారం సంపద 3.8 ట్రిలియన్ డాలర్లకి చేరింది.
కానీ ఎక్కువ భాగం ఆభరణాల్లో ఉండటంతో నిజమైన రాబడి తక్కువగా ఉంది. ఫైనాన్షియల్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ ప్రకారం, భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు (చైనా తర్వాత). మొత్తం 34,600 టన్నులు కుటుంబాల వద్ద ఉన్నాయి. భారతదేశంలో ఫిబ్రవరి ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ధర పది గ్రాములకు రూ.1,30,401 వద్ద ఉంది. గ్లోబల్ స్పాట్ గోల్డ్ ఔన్స్ (28 గ్రాములు) 4,212.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఫెడ్ ప్రభావంతో ఈటీఎఫ్‌లకు డిమాండ్
యూఎస్ ఫెడ్ రేట్ల ప్రభావంతో ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్ గోల్డ్‌కు మారడం పెరుగుతోంది. బంగారం ధరల పెరుగుదలతో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడుల్లో కనీసం 30శాతం విలువ గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. 2024–25లో ఈ వాటా కేవలం 3.5శాతం మాత్రమే. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుండడంతో రిస్క్ తక్కువగా ఉండే గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతోంది.

