ఇప్పటికీ జగమంతా దేవీ జపమే.. 

ఇప్పటికీ జగమంతా దేవీ జపమే.. 

అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎన్నో మరుపరాని సినిమాల్లో నటించి వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆమె ఈ లోకాన్ని వీడిచి నాలుగేళ్లు దాటినా.. ఆ పేరు చెబితే ఇప్పటికీ అదే క్రేజ్‌. ఇంత చెప్పిన తర్వాత ఆమె ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఈ నేల మీద తను అడుగుపెట్టిందో.. ఆనాటి నుంచీ జగమంతా దేవీ జపమే. ఆమెనే  ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌ శ్రీదేవి. నేడు ఈ అతిలోక సుందరి 59వ జయంతి. ఈ సందర్భంగా ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గురించి తెలుసుకుందాం..

నవ్వితే అందం. నడిస్తే అందం. మాట్లాడితే అందం. మౌనంగా ఉన్నా అందమే. 
పోతపోసిన సౌందర్యానికి పసిడి  వన్నెలు అద్ది నేలపైకి దింపాడా దేవుడు. 
శ్రీదేవిని చూసిన తర్వాతే అతిలోక సుందరి అనే పదం పుట్టిందేమో అనిపిస్తుంది.
చిలిపి నవ్వులతో చిన్నా పెద్దా అందరినీ తన ప్రేమలో పడేసుకుంది.
మళ్లీ ఆ లోకానికే వెళ్లిపోయిందో ఏమో.. ఉన్నట్టుండి కనుమరుగయ్యింది.
వెళ్తూ వెళ్తూ ఎంత తలచుకున్నా తరగనని జ్ఞాపకాలను దోసిళ్లలో పోసి పోయింది.
వాటిని తవ్వి తీసుకోవడమే మన పని.  

ఎక్కడో శివకాశీలో పుట్టిన శ్రీదేవికి.. దేశం మొత్తానికీ నచ్చేంత నయగారం ఎలా వచ్చిందో.
చూపు తిప్పుకోనివ్వకుండా కళ్లను తెరలకు కట్టేసేంత గొప్ప ప్రతిభ ఎలా అబ్బిందో.
ప్రతి హృదయంలోనూ తనని ప్రతిష్టించుకునేటంత ప్రేమని ఎలా సంపాదించుకోగలిగిందో. 
 ‘వసంత కోకిలగా’ ఎంత అమాయకంగా కనిపించిందని! 
‘పదహారేళ్ల వయసు’లో ప్రతి ఒక్కరి చూపునీ ఎలా తిప్పేసుకుందని!
కంటికి కనిపించని ‘మిస్టర్ ఇండియా’తో ఎంత అందంగా రొమాన్స్ చేసిందని!

ఈ ప్రపంచమే నీది, దాసోహం చేసుకొమ్మన్నాడు. అదే కదా జరిగింది!
తమిళనాడులో పుట్టి.. తెలుగునాట ఎదిగి.. కన్నడ, మలయాళ సీమల్ని పలకరించి.. హిందీ సీమలో అడుగుపెట్టిన శ్రీదేవి.. అక్కడి నుంచి ఎవరూ అందుకోలేని స్థాయికి చేరిపోయింది.
నటనంటే ఆమె. హావభావాలంటే ఆమెవి. పాత్ర ఏదైనా అనవసరం. శ్రీదేవి చేసిందంటే అది అత్యద్భుతం. 
తొలి సినిమా ‘బంగారక్క’ నుంచి చివరి సినిమా ‘మామ్’ వరకు ఏదైనా సరే.. అది శ్రీదేవి సినిమా. అంతే.
హీరోలకి మాత్రమే స్టార్‌‌డమ్‌ వస్తుందనేవారి నోళ్లకి ఆమె సీల్ వేసేసింది.

స్టార్ హీరోయిన్ అనే మాటకి తొలి నిర్వచనమయ్యింది.
హీరోల్ని మించి ఒక హీరోయిన్ ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోగలదని నిరూపించింది. 
తనతో సినిమాలు తీయాలని దర్శకులు తపించేలా చేసింది. 
తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని హీరోలు ఆరాటపడే పరిస్థితి కల్పించింది. 
ఈ ఘనత ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ హీరోయిన్‌కి దక్కింది!
శ్రీదేవి మాత్రమే సాధించింది. అందుకే ఆమె ఎవర్‌‌ గ్రీన్ స్టార్ అయ్యింది.

తెలుగు తెరపై ఎంతో మంది దేవకన్యల పాత్రలు పోషించినా అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ  అతిలోకసుందరి మాత్రం ఒక్కరేనేమో!
ఆ దిష్టే తగిలిందో.. లేక ఆ సౌందర్యాన్ని, అనిర్వచనీయమైన నటనా వైదుష్యాన్ని తన దగ్గరే అట్టిపెట్టుకోవాలనుకుందో..
మృత్యువు సైతం ముచ్చటపడి ఆమెని తనతో తీసుకుపోయింది.  ఈ లోకానికి కొండంత విషాదాన్ని వదిలిపెట్టింది. 
ఆమె వదిలిన వెలితి నేటికీ పూడుకోలేదు. ఎందుకంటే..తన స్థానాన్ని ఆక్రమించే నటి ఇంతవరకు కనిపించలేదు.
ఎలా కనిపిస్తారు? తన ప్లేస్‌ని ఎవరైనా ఎలా రీప్లేస్ చేయగలరు?
ఆమె శ్రీదేవి. అలాంటి నటి లేదు.. రాదు. ఆమె స్థానం ఆమెదే. అది ఎప్పటికీ పదిలమే.

యేళ్లు మరలిపోయినా.. యుగాలు గడిచిపోయినా.. ఆమె స్థానం ఎప్పటికీ ఆమెదే.
మళ్లీ భూమిపై అంగుళీకం పోగొట్టుకోదా? వెతుక్కుంటూ భూలోకం రాకపోదా అని వేచి చూసే అభిమానులెంతమందో!!