
- నామమాత్రంగా నిర్వహిస్తున్నారని విమర్శలు
- ఏటా లక్షలు ఖర్చుచేస్తున్నా ఫలితం శూన్యం
- 8 ఏండ్ల నుంచీ అవే పుస్తకాలు.. ఇంకా కనిపిస్తున్న తప్పులు
- తెలంగాణ వచ్చినా మారని టెక్ట్స్‌బుక్స్ కంటెంట్
హైదరాబాద్, వెలుగు: ఎనిమిదేండ్లుగా అవే పుస్తకాలు. ఏటా ఎక్స్‌పర్ట్‌లను కూర్చోబెట్టి మరీ ‘ఎరాటా(తప్పొప్పుల దిద్దుబాటు కార్యక్రమం)’ నిర్వహిస్తరు. అయినా.. కుప్పలు కుప్పలుగా తప్పులు అట్లనే ఉంటున్నయి. పాఠ్యపుస్తకాల్లో తప్పులను సరిచేసేందుకు స్టేట్ కౌన్సిల్ఆఫ్ఎడ్యుకేషనల్రీసెర్చ్అండ్ట్రెయినింగ్(ఎస్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ ‘ఎరాటా’ కొనసాగుతున్న తీరుపై విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షలు ఖర్చు చేస్తున్నా, పెద్దగా లోపాలను మాత్రం గుర్తించడం లేదని, అలాగని పుస్తకాల్లో తప్పులు కూడా తగ్గడం లేదని అంటున్నారు.
రాష్ట్రం వచ్చినా.. పాత పాఠాలేనా?
తెలంగాణ రాష్ట్రమొచ్చి ఐదేండ్లు దాటినా, అన్ని టెక్ట్స్‌బుక్స్‌లో ప్రాంతీయ అంశాలను ప్రవేశపెట్టలేదు. ఇంకా చాలా పుస్తకాల్లో ఏపీకి సంబంధించిన అంశాలనే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ పాఠ్య పుస్తకాలను ఎస్‌సీఈఆర్టీ తయారు చేస్తోంది. 8 భాషల్లో సుమారు 200 వరకూ టైటిల్‌బుక్స్‌కు కంటెంట్‌ను అందిస్తోంది. ఎస్‌సీఈఆర్టీ గైడ్‌లైన్స్ ప్రకారం ఆయా తరగతులకు సబ్జెక్ట్‌ను అందిస్తోంది. చివరిసారిగా 2011లో సబ్జెక్టుల్లో పూర్తిగా మార్పులు జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు, సోషల్ పుస్తకాలను మాత్రమే మార్చారు. మిగిలిన పుస్తకాల్లో చిన్నచిన్న మార్పులతో సరిపుచ్చారు. అయితే తెలుగు మీడియం సబ్జెక్టుల్లో చిన్నచిన్న తప్పులు వచ్చినా, ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్లో మాత్రం భారీగా కంటెంట్ తప్పిదాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వచ్చి ఐదేండ్లు దాటినా, పాఠ్యపుస్తకాల్లో ఇంకా ఏపీకి సంబంధించి ప్రాంతాల పేర్లు, నదుల పేర్లు కనిపిస్తున్నాయి. వివిధ అంశాలకు సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్, ఉదాహరణలకూ ఏపీకి సంబంధించిన అంశాలనే ఉపయోగిస్తున్నారు. టెన్త్‌లో బయోలజీతో పాటు 9వ తరగతి ఫిజిక్స్ పుస్తకాల్లోనూ అచ్చుతప్పులు బోలెడున్నాయి. అయితే చిన్నచిన్న కంటెంట్ అంశాలను మార్చే అవకాశమున్నా, ఎస్‌సీఈఆర్టీ అధికారులు మాత్రం చూసీ చూడనట్టు ఉంటున్నారన్న విమర్శలున్నాయి.
తప్పులు లేకుండా చూస్తాం
స్టూడెంట్స్‌కు ఎలాంటి తప్పులు లేని పాఠ్య పుస్తకాలను అందించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. ఏమైనా చిన్నచిన్న తప్పులు గుర్తిస్తే, వెంటనే వాటిని మార్చేస్తున్నాం. స్టూడెంట్స్‌కు ఒక్కతప్పు లేకుండా పుస్తకాల్లో కంటెంట్ అందించేలా చూస్తాం. ఎవరైనా పుస్తకాల్లో తప్పులను గుర్తిస్తే, ఆయా అంశాలను వెబ్‌సైట్ ద్వారా గానీ, నేరుగా ఆఫీస్‌కు గానీ పంపించాలి. వాటిలో నిజనిజాలు గుర్తించి, అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తాం.
– శేషుకుమారి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్
నామమాత్రంగా ‘ఎరాటా’
ప్రతి అకడమిక్ఇయర్లో డిసెంబర్, జనవరి నెలల్లో ఎస్‌సీఈఆర్టీ ‘ఎరాటా’(తప్పొప్పుల దిద్దుబాటు) కార్యక్రమాన్ని చేపడుతోంది. ఒక్కో సబ్జెక్ట్‌కు మూడు నుంచి ఐదు రోజులు వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఒక్కో సబ్జెక్ట్‌కు10 నుంచి15 మంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో ప్రస్తుతమున్న పుస్తకాల్లో తప్పులను చెక్ చేయిస్తుంటారు. అయితే ఇది ఓ తంతుగానే జరుగుతోందని చెబుతున్నారు. ఐదేండ్ల నుంచి పాతవారినే ఈ వర్క్‌షాప్‌కు పిలుస్తుండటంతో వారు పెద్దగా తప్పులను గుర్తించడం లేదని అంటున్నారు. ఏటా కొత్తవారిని పిలిస్తే, వారు ఇంకొన్ని తప్పులు గుర్తించే అవకాశముందని విద్యావేత్తలు చెప్తున్నారు. పుస్తకాల్లో వచ్చే తప్పులను ప్రొఫెసర్లు, టీచర్లు, ఇతర వ్యక్తులు గుర్తించి ఎస్‌సీఈఆర్టీ మెయిల్‌కు గానీ, ఆఫీస్‌కు గానీ పంపిస్తుంటారు. వీటిలో ఏమైనా మార్పులకు అవకాశముంటే, వాటిని మార్చేసి ‘ఎరాటా’ను నామమాత్రంగా ముగించేస్తున్నారనే విమర్శలున్నాయి.