ప్రతి ఆరు గంటలకు ఓ ఉరి శిక్ష

ప్రతి ఆరు గంటలకు ఓ ఉరి శిక్ష

ఇరాన్ లో మరణశిక్ష ఇక్కడ ఒక జోక్‌గా మారింది.   ప్రతి 6 గంటలకు ఒక వ్యక్తిని ఉరి తీస్తున్నారు, చిన్న తప్పు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. మరణశిక్షలో చైనా తర్వాత ఇరాన్ రెండవ స్థానంలో నిలిచింది .

2023లో 194 మందికి ఉరిశిక్ష

మరణశిక్షను అమలు చేయడంలో  ఇరాన్  అపఖ్యాతిని మూటగట్టుకుంది. చైనా తర్వాత ఈ దేశంలోనే అత్యధికంగా ఉరిశిక్షను అమలు చేస్తున్నారు. 2023వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి చిన్న తప్పుకు కూడా  మరణశిక్షను అమలు చేస్తున్నారు. గత 10 రోజులుగా ఇక్కడ ప్రతి ఆరు గంటలకు ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఇరాన్ మానవ హక్కుల నివేదిక ప్రకారం, ఈ ఏడాది  ఇప్పటివరకు ( మే 8 వరకు) 194 మందిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది.

విచారణ లేకుండా శిక్ష


గత రెండు వారాలుగా ఇరాన్‌లో 42 మందిని ఉరితీశారు. వీరిలో సగానికి పైగా ప్రజలు బలూచిస్తాన్ ప్రాంతం నుండి పట్టుబడ్డారు. దీంతో బలూచ్ మైనారిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి సంఖ్య తక్కువగా ఉండటంతో...విచారణ లేకుండా ఆరోపణల ఆధారంగా మరణశిక్ష విధిస్తున్నారని బలూచ్ మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ద్వంద్వ పౌరసత్వం కూడా నిషేధం

ఇరాన్ లో ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారిని  ఉగ్రవాదులుగా ప్రకటించి ఉరితీస్తున్నారు. ఇక్కడి  ప్రభుత్వ తీరుపై పలువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తర్వాత ఎవరికి శిక్ష అమలు చేస్తారోనని ఆందోళనచెందుతున్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.