- డేటా చౌకగా లభిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటన్న జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి జిల్లాకు 5జీ కనెక్టివిటీ చేరుకుందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.5 లక్షలకు పైగా 5జీ బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. వివిధ డిజిటల్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులను అనుసంధానించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా10వ ఎడిషన్ 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' (ఐఎంసీ 2026)ను ఆయన ప్రారంభించారు. విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలను డిజిటల్ కనెక్టివిటీ శక్తివంతం చేసిందని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల పిల్లలు, పేద విద్యార్థులు సైతం నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారని చెప్పారు. 'దీక్ష' ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ విద్య ప్రాముఖ్యత ఎంతగానో పెరిగిందని గుర్తుచేశారు.
కోవిడ్ కాలంలో జూలై 2022 నాటికి దీక్ష ప్లాట్‌ఫామ్‌లో 500 కోట్లకు పైగా లెర్నింగ్ సెషన్లు, 6 వేల కోట్ల లెర్నింగ్ నిమిషాలు నమోదయ్యాయని తెలిపారు. 2014లో 1 జీబీ డేటా ధర రూ.268 ఉండగా, ప్రస్తుతం అది కేవలం రూ.8కి మాత్రమే లభిస్తోందని, తద్వారా ప్రపంచంలో అత్యంత చౌకైన డేటా అందిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
