ఆర్మీ అంటే వాళ్లకు ప్రాణం

ఆర్మీ అంటే వాళ్లకు ప్రాణం

మహబూబ్ నగర్: దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేయడానికి ఆ గ్రామంలోని యువకులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే వాళ్లు భారత సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. మూడున్నర దశాబ్దాల కిందట ఒక్కరితో మొదలైన సైనిక ప్రస్థానం... నేడు వంద మందికి పైగా ఆర్మీలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకునే వరకు వచ్చింది. ఇలా ఎందరో యుద్ధ వీరులను సరిహద్దుకు పంపిన కూచూరు గ్రామం...  సోల్జర్స్ విలేజ్ గా పేరు పొందింది.

కూచూరు... సైనికులకు పుట్టినిల్లు 

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కూచూరుకు మరే గ్రామానికి లేని ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలోని ప్రతి ఇంటి నుంచి ఓ సైనికుడు సైన్యంలో ఉన్నారంటే ... ఈ ఊరికి ఉన్న గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సరిగ్గా మూడున్నర దశాబ్దాల కిందట గ్రామానికి చెందిన ఓ యువకుడు భారత సైన్యంలో చేరాడు. ఆ ఒక్క జవాన్ ఊరందరికి ప్రేరణగా నిలిచాడు. అతని స్పూర్తితో కన్న తల్లికి, పుట్టిన ఊరికి, దేశానికి పేరు తేవాలన్న లక్ష్యంతో కూచూరు గ్రామ యువత సైన్యంలో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఈ గ్రామంలో చిన్న తనం నుంచే విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తిని అలవరుస్తుంటారు. ఇక్కడి యువకులు పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుంటారు. పదో తరగతి పూర్తి కాగానే అథ్లెటిక్స్ సహా ఇతర క్రీడల్లో శిక్షణ తీసుకుంటారు. ప్రతి ఆర్మీ ర్యాలీలో పాల్గొంటారు. ప్రతి ఆర్మీ సెలక్షన్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి సైన్యంలో చేరతారు. పంజాబ్, జమ్మూ, గోవా, హైదరాబాద్, అసోం... ఇలా దేశ నలుమూలల కూచూరు గ్రామానికి చెందిన యువకులు సైనికులుగా పని చేస్తున్నారు. 

గ్రామ యువకులను ప్రోత్సహిస్తోన్న రిటైర్డ్ సైనికులు

ఇతర ఉద్యోగాల కన్నా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలంటేనే ఇష్టమని కూచూరు గ్రామస్తులంటున్నారు. ఇదే గ్రామం నుంచి భారత సైన్యంలో పని చేసి 35 మంది రిటైర్డ్ అయ్యారు. సైన్యంలో వారు పనిచేస్తున్న క్రమంలో ఎదురైన అనుభవాలు, అక్కడి పరిస్థితులను కూచూరు యువతను ఆర్మీలో చేరేలా ప్రోత్సహిస్తున్నాయి. ఆర్మీలో చేరిన యువకులకు స్వగ్రామంలో లభించే గౌరవం అంతా ఇంత కాదు. సైన్యంలో ఇంత మంది పనిచేస్తున్నందుకు గ్రామస్తులు ఎంతగానో గర్వ పడుతున్నారు. ఇక కుటుంబ సభ్యుల ఆనందానికతై అవధులే ఉండవని గ్రామస్థులు చెబుతున్నారు. ఒక గ్రామం నుంచి ఒక్కరూ కాదు... ఇద్దరు కాదు... ఏకంగా వందల సంఖ్యలో సైనికులు ఉండటం నిజంగా గొప్ప విషయం. సాఫ్ట్ వేర్, డాక్టర్, బిజినెస్ అంటూ నేటి యువత డబ్బు చుట్టూ పరుగులు పెడుతోంటే... కూచూరు గ్రామానికి చెందిన యువకులు మాత్రమే సైన్యంలో  చేరి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామస్థుల దేశభక్తి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.