ప్రతి పంచాయతికీ రూ. 8 లక్షలు

ప్రతి పంచాయతికీ రూ. 8 లక్షలు

‘‘ఒకనాడు ఒక ఉద్యమంగా ప్రారంభమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థ నేడు ఒక అవశేషంగా మిగిలిపోయింది. నిర్వీర్యమైపోయిన స్థానిక సంస్థలకు జవసత్వాలు కల్పిస్తం. అందుకే నూతన పంచాయతీరాజ్​ చట్టానికి రూపకల్పన చేసినం” అని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్రంలోని పంచాయతీలన్నింటికీ రూ. 2,458 కోట్లు అందుతాయని చెప్పారు. దీని లెక్కన 500 మంది జనాభా ఉన్న పంచాయతీకి కూడా సంవత్సరానికి రూ. 8 లక్షల అభివృద్ధి నిధులు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ, స్థానిక సంస్థల నిధులు వీటికి అదనమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం హైదరాబాద్​లోని జూబ్లీహాల్​ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అంతకుముందు గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. జూబ్లీహాల్​లో జాతీయ జెండాను ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణాలు, నగరాలు అస్తవ్యస్తంగా, అడ్డదిడ్డంగా పెరగకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఫ్యూడల్‌ కాలంలో రూపొందించిన చట్టంలో అవినీతికి ఆస్కారమిచ్చే లొసుగులు అట్లనే ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకున్న సందర్భంలో ఈ లోపాలన్నీ ప్రభుత్వ సంకల్పానికి అడ్డంకిగా మారినయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ చట్టాన్ని పునరావలోకనం, పునస్సమీక్షించడానికి ప్రభుత్వం పూనుకున్నది’’ అని సీఎం అన్నారు. భూ క్రయవిక్రయాలు, పేరు మార్పిడి, ఇతర విషయాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రైతులకు రూ. లక్ష రుణమాఫీ…

రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గతంలో రూ.లక్ష రుణమాఫీ చేశామని, ఇప్పుడు మళ్లీ రూ.లక్ష వరకు రుణ మాఫీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. రైతులందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా క్రాప్‌‌‌‌ కాలనీలను ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని వివరించారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి అందించే రూ. 8 వేల సాయాన్ని రూ. 10 వేలకు పెంచి ఈ సంవత్సరం నుంచే అందించనున్నట్లు చెప్పారు. ‘‘నేను స్వయంగా రైతును. మట్టిని నమ్ముకొని బతకడంలో ఉన్న మాధుర్యం నాకు తెలుసు. చేసిన కష్టం మట్టి పాలైపోతే కలిగే ఆవేదన కూడా నాకు తెలుసు. అందుకే నేను కంటున్న కల ఒక్కటే.. రైతుల తలరాతలు మారాలె. వ్యవసాయం లాభసాటి కావాలె. రైతుల నెత్తి మీద అప్పుల భారం తొలిగిపోయి ప్రతి రైతు దగ్గర ఎంతో కొంత నగదు నిల్వ ఉండే పరిస్థితి రావాలె. భారతదేశంలో ధనవంతమైన రైతాంగం ఎక్కడ ఉన్నారంటే.. అది తెలంగాణలో ఉన్నారని చెప్పుకునే రోజులు రావాలె’’ అని ఆయన ఆకాంక్షించారు. హరితహారంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ అనుభవించిన దుఃఖాలన్నీ ఒక ఎత్తయితే, సాగునీటి కోసం అనుభవించిన దుఃఖం ఒక్కటే ఇంకో ఎత్తు. తలాపున గోదావరి, పక్కనే కృష్ణమ్మ పారుతున్నా, మడి తడిపే నీళ్లకు నోచుకోక తెలంగాణ గొడగొడ ఏడ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తమ పొలాలకు నీళ్లు మల్లవని తెలుసుకున్న జనం నిప్పుల ఉప్పెనగా మారిన్రు. తెలంగాణ సాధించిన్రు. బీళ్లకు నీళ్లు మళ్లించే గురుతర బాధ్యతను మా భుజస్కందాల మీద మోపిన్రు.. వాళ్ల దుఃఖం ఇక తీరుద్ది..’ అని సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం సగటున 16.5 శాతం వృద్ధిరేటును సాధించిందని తెలిపారు. ‘‘తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతగాదని, తెలంగాణ వస్తే గాఢాంధకారం అలుముకుంటదని, రాష్ట్రంగా మనుగడ సాగించలేదని సమైక్య పాలకులు జోస్యాలు చెప్పిన్రు. జోకులు వేసిన్రు. నవ్విన నాపచేనే పండిందన్నట్టుగా తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తుంటే అప్పట్లో అపహాస్యం చేసిన వాళ్లే ఇప్పుడు అవాక్కవుతున్నరు” అని సీఎం అన్నారు.

పెంచిన పింఛన్​ పైసలు జులై 1  నుంచి….

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రూ. 200 నుంచి వెయ్యి రూపాయలకు ఆసరా పింఛన్లు పెంచి అమలు చేశామని, ఇప్పుడు వాటిని రూ. 2,016కు పెంచుతున్నామని, వికలాంగుల పింఛన్లను రూ. 1500  నుంచి రూ. 3,016 కు పెంచుతున్నామని, పెరిగిన పింఛన్​ పైసలు లబ్ధిదారులకు జులై 1 నుంచి అందిస్తామని సీఎం తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి, కొత్తగా మరో ఆరేడు లక్షల మందికి పెన్షన్ అందించబోతున్నట్లు చెప్పారు. రాజధానిలో అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలను త్వరలోనే నిర్మిస్తామన్నారు. కంటి వెలుగు పథకం మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రా రంభించనుందని చెప్పారు. ప్రజలందరి సమగ్ర హెల్త్‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌ రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. మిషన్‌‌‌‌ కాకతీయ అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంతో పాటు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిందన్నారు.

ఇంత ఎండల్లోనూ తాగునీటి గోస లేదు…

యావత్ దేశంలోనే వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని సంతోషంగా ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు. ‘‘ఇంత భయంకరమైన వేసవి ఎండల్లోనూ తాగునీటి కోసం గోస పడటం లేదు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే బాధలు పడటం లేదు. గతంలో సర్వత్రా కనిపించే బిందెల ప్రదర్శనలు బందయ్యాయి. మిషన్​ భగీరథ ప్రజలను ఆ బాధల నుంచి విముక్తులను చేసింది. మిషన్​ భగీరథ పనులు పూర్తి కావచ్చినాయి” అని సీఎం చెప్పారు.  గ్రామీణ ప్రాంతాల్లో మిషన్​ భగరీథ పనులు 97 శాతం పూర్తయ్యాయని, జులై చివరి నాటికి వందకు వంద శాతం పూర్తి చేస్తామని, పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ‘‘కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలు మా మానస పుత్రికలు. కేసీఆర్‌ కిట్‌ మహిళా సంక్షేమానికి కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నది. పెద్ద ఎత్తున జరిగిన గొర్రెల పంపిణీ గొల్ల కురుమల జీవ సంపదను పెంచింది. చేనేత, పవర్‌లూం కార్మికుల ఆత్మహత్యలను నివారించడానికి 50 శాతం సబ్సిడీతో రంగులు, రసాయనాలు అందిస్తున్నం. ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెంచినం. నియోజకవర్గ, జిల్లా కేంద్ర దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచినం. కిడ్నీ పేషంట్ల కోసం డయాలసిస్‌ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినం’’ అని అన్నారు.