ఆ 20 గ్రామాల్లోని ప్రాజెక్ట్ నిర్వాసితులు ఎటువైపు..?

ఆ 20 గ్రామాల్లోని ప్రాజెక్ట్ నిర్వాసితులు  ఎటువైపు..?
  • ఆసక్తి కలిగిస్తున్న గజ్వేల్ రాజకీయం
  • వెంకట్రామిరెడ్డికి మద్దతు లభించేనా..?

సిద్దిపేట, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్ట్ నిర్వాసితులు ఎటు వైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.  మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో 20 గ్రామాలకు చెందిన దాదాపు 8 వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. వీరంతా గజ్వేల్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. 

ఈ రెండు ప్రాజెక్ట్​లకు సంబంధించి భూసేకరణ మొత్తం ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్ గా ఉన్న సమయంలో జరిగింది. కలెక్టర్ గా ఎన్నో హామీలు ఇచ్చి అవి అమలు చేయకపోగా, పదవికి రాజీనామా చేసి తమను గాలికొదిలేశాడనే భావన నిర్వాసితుల్లో బలంగా ఉంది. దీనికి తోడు గజ్వేల్ పట్టణం, తునికి బొల్లారంలో ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణంలో వెంకట్రామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అక్కడ కూడా మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవడంతో నిర్వాసితులు, రైతులు అతడిపై గుర్రుగా ఉన్నారు. 

వెంకట్రామిరెడ్డిపై ఆగ్రహం

ఎన్నో హామీలు ఇచ్చి తమను రోడ్డు పాలు చేసిన వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వంపై నిర్వాసితులు ఆగ్రహంగా ఉన్నారు.  గ్రామాలు ఖాళీ చేయించేటప్పుడు చూపిన చొరవ తర్వాత పరిహారాలు ఇప్పించే విషయంలో చూపలేదనే భావన అందరిలో ఉంది. ఇప్పుడు ఓట్ల కోసం వస్తే నిలదీయడానికి అందరూ సిద్దంగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్అండ్ ప్యాకేజీ, ఒంటరి మహిళలు, పురుషులకు సంబంధించి ప్యాకేజీలతో పాటు అనేక విషయాల్లో వెంకట్రామిరెడ్డి తన మాటను నిలుపుకోలేదని, ఇప్పుడు ఓట్ల కోసం వస్తే ఎలా వేస్తామనే ప్రశ్న నిర్వాసితుల నుంచి వస్తోంది. ఆ సమయంలో అధికారులు వ్యవహరించిన తీరు ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిర్వాసితులను ఎవరిని కదిలించినా వారి  కన్నీటి గాథల వెనుక అప్పటి అధికారి పేరే ప్రస్తావనకు వస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజార్టీ  ఓట్లు పోలైనా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

అంతంత మాత్రంగానే ప్రచారం..

ప్రాజెక్ట్​ నిర్వాసితులు ఎక్కువగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఇటీవల గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తే డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు అడ్డుకున్నారు. అంతకుముందు నిర్వాసితుల భయంతో శామీర్ పేటలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోను కార్యకర్తల సమావేశాలను ఎక్కువగా నియోజకవర్గం బయటే నిర్వహించారు. శామీర్ పేటలో కేసీఆర్ నిర్వహించిన సమావేశంతో పాటు గౌరారంలో హరీశ్​రావు నిర్వహించిన సమావేశాల్లో సైతం నిర్వాసితుల సమస్యల పై నిరసనలు వ్యక్తమైన సంఘటనలు జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచాం చేస్తే  నిర్వాసితులు నిలదీసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.