తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు..? బాధ్యతలు హరీష్ లేదా కేటీఆర్ కు అప్పగిస్తారా..?

తెలంగాణలో ప్రతిపక్ష నేత ఎవరు..? బాధ్యతలు హరీష్ లేదా కేటీఆర్ కు అప్పగిస్తారా..?

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో తేలిపోయింది. ప్రతిపక్షంలో కూర్చునేది ఎవరో కూడా క్లారిటీ వచ్చింది. అయితే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు చాలామంది దీని గురించే చర్చించుకుంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు సీఎం ఎవరు అనేదానిపై బిజీగా ఉంటే.. ఇటు బీఆర్ఎస్ లో మాత్రం ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఎవరు ఉంటారు అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటారా..? ఉండరా..? అని చాలామంది చర్చించుకుంటున్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించకపోతే... ఆ బాధ్యతలను హరీష్ రావు లేదా కేటీఆర్ కు అప్పగిస్తారా...? అనే చర్చ సాగుతోంది. అంతేకాదు.. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..? రారా..? అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొలిసారి ప్రతిపక్షంలో కూర్చోబోతోంది బీఆర్ఎస్ పార్టీ. 

బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త గెలిచిన ఎమ్మెల్యేలతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణల భవన్ లో సోమవారం (డిసెంబర్ 4న) భేటీ అయ్యారు. గెలుపోటములపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యేలతో మంతనాలు చేశారు. అనంతరం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలందరూ.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో భేటీ అయ్యారు. పార్టీ గెలుపోటములు.. నియోజకవర్గాల్లో పరిస్థితిని కేసీఆర్ కు వివరించారు ఎమ్మెల్యేలు.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 64 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు సాధించింది. ఆరుగురు మంత్రులు ఓడిపోయారు. బీజేపీకి 8 సీట్లు దక్కాయి. 2018తో పోలిస్తే ఏడు సీట్లు బీజేపీకి ఎక్కువగా వచ్చాయి.  మరోవైపు.. ఎంఐఎం పార్టీ ఏడు సీట్లను కాపాడుకుంది. ఇటు బీఎస్పీ పార్టీ మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక జనసేన అసలు ప్రభావమే చూపలేదు. సీపీఎం పార్టీ అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.